అర్హులందరికి ఓటుహక్కు
కడప సెవెన్‌రోడ్స్ : అర్హులందరినీ ఓటర్ల జాబితాలో నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అఽధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 2025 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా అనర్హులను తొలగించి అర్హులకు చోటు కల్పించాలన్నారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలన్నారు. ఈసీఐ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంటెన్సివ్ రివిజన్‌కు సంబంధించిన మార్గదర్శకాలపై ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ అదితిసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు పాల్గొన్నారు.
సురక్షితమైన తాగునీరు అందించాలి :
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
జిల్లాలో ఏ గ్రామంలో కూడా తాగునీటి కొరత రాకుండా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో అమలవుతున్న శుద్ధ తాగునీటి సరఫరా, పారిశుధ్య పనుల పురోగతిపై డ్రింకింగ్ వాటర్ – శానిటేషన్ మిషన్ కమిటీ సభ్యులైన.. అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా శుద్ధ తాగునీటి సరఫరా అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కుళాయి కనెక్షన్లను పూర్తి స్తాయిలో నిర్వహణలోకి వచ్చేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ముఖ్యంగా పులివెందుల వాటర్ గ్రిడ్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమృద్ధిగా తాగునీరు అందేలా పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా పనులను పూర్తి చేసేలా దృష్టి సారించాలన్నారు. ఎక్కడైనా తాగునీరు కలుషితం అయినట్లు సమాచారం అందితే సంబంధిత అధికారులపై శాఖా పరంగా చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీపీఓ రాజ్యలక్ష్మి, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ ఏడుకొండలు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రమణ, పంచాయతీరాజ్, డీఆర్డీఏ, మెప్మా, వ్యవసాయ శాఖ, ప్రజారోగ్య శాఖ, భూగర్భ జలాలు, ఫారెస్ట్ సబ్ డివిజన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
వివేక్ యాదవ్


