త్రుటిలో తప్పిన ప్రమాదం
– ఆర్టీసీ బస్సు నుంచి కిందపడిన యువకుడు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని ముద్దనూరు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులో నుంచి యువకుడు కింద పడ్డాడు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే నిత్యం బస్టాండు ఆవరణంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక మహిళ కూడా బస్సు నుంచి కిందకు దిగకుండానే బస్సు కదలడంతో ఆ మహిళ రోడ్డుపై పడింది. గురువారం కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండి బస్సు కదిలించడంతో యువకుడు బస్సులో నుంచి దిగుతుండగా జారి కిందపడ్డాడు. డ్రైవర్లు చూసుకోకుండానే డ్రైవింగ్ చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు దిగిన తర్వాత బస్సు కదిలించాల్సి ఉంది.. కానీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల వారానికొకసారి బస్సులో నుంచి ప్రయాణికులు కింద పడుతూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
చైన్ స్నాచర్ అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన జానపాటి లక్ష్మిదేవి అనే వృద్ధురాలు మెడలో నుంచి బంగారు చైన్‌ను లాక్కెళ్లిన నిందితుడిని త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ భావన గురువారం సాయంత్రం అరెస్ట్ వివరాలను మీడియాకు తెలిపారు. లక్ష్మీదేవి బుధవారం రాత్రి తన ఇంటి ముందు ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలను పరిశీలించి హోమస్‌పేటకు చెందిన షేక్ మౌలాలి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతను గురువారం సాయంత్రం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 30 గ్రాముల బంగారు గొలుసును స్వాఽధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో త్రీ టౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్‌ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరచిన పీసీలు ప్రసాద్, సుబ్రమణ్యం, జనార్దన్‌రెడ్డిలను డీఎస్పీ అభినందించారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం


