నేడు కడపకు శ్రీచరణి!
సాక్షి ప్రతినిధి, కడప: మహిళా క్రికెట్‌లో సత్తా చాటి కడప ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన జిల్లా ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి శుక్రవారం జిల్లాకు రానున్నారు. మహిళా ప్రపంచ కప్ టోర్నీలో ఆద్యంతం రాణించి.. క్రీడా ఆణిముత్యంగా నిలిచిన శ్రీచరణికి ఘనస్వాగతం పలికేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంలో వైఎస్సార్ కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. కడప నగరమంతా విజయోత్సాహంలో ఉన్న శ్రీచరణి పోస్టర్లు వెలిశాయి. కడప గడపలో శిక్షణ పొంది ఐదేళ్ల కాలంలోనే భారత జట్టులో స్థానం సంపాదించేందుకు తెరవెనుక కృషి చేసిన కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ ఆసోసియేషన్ అంతే బాధ్యతగా ఘనంగా సత్కరించుకోనున్నాయి. శుక్రవారం సాయంత్రం 4.30గంటల నుంచి హెడ్‌పోస్టాఫీసు, ఏడు రోడ్లు, ఎన్టీయార్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, ఎర్రముక్కపల్లె సర్కిల్, రాజీవ్ మార్గ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. అనంతరం వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 6.30 గంటలకు ఘనంగా సత్కరించనున్నారు. జిల్లా ఖ్యాతి ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన శ్రీచరణితో క్రికెట్ అసోసియేషన్‌కు ఉన్న అనుబంధాన్ని పంచుకోనున్నారు. శ్రీచరణికి జిల్లా క్రీడాభిమానులు ఘనస్వాగతం పలికి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.భరత్‌రెడ్డి, ఏ.రెడ్డిప్రసాద్ కోరారు.
అంచెలంచెలుగా ఎదిగిన శ్రీచరణి...
వీరపునాయునిపల్లె మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె శ్రీచరణి సాధారణ కుటుంబంలో పెరిగి క్రీడా రంగంలో అంచెలంచెలుగా ఎదిగింది. ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్‌లో చదివింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని లేపాక్షి జూనియర్ కళాశాలల్లో పూర్తి చేసింది. ప్రస్తుతం వీఎన్‌పల్లె వీఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ కంప్యూటర్స్ చదువుతూ క్రికెట్‌లో రాణిస్తోంది. 2017–18లో క్రికెట్‌లో జిల్లా అండర్–19 జట్టు కు ఎంపికైంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. 2023లో బీసీసీఐ సీనియర్ అంతర్ రాష్ట్ర మహిళల క్రికెట్ మ్యాచ్‌లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించి కర్నాటక జట్టుపై 7వికెట్లు, అండర్–23 మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టుపై 5వికెట్లు తీసి ఉత్తమ ప్రదర్శన కనబర్చింది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా, లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్ ఉమెన్‌గా నిలకడగా రాణించింది. శ్రీచరణి ఆట నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీల్ ప్రతినిధులు డిల్లీ క్యాపిటల్స్‌కు రూ.55లక్షలతో ఎంపిక చేసుకున్నారు. ఏప్రిల్ 27 నుంచి మే11 వరకూ జరిగిన శ్రీలంక ముక్కోణపు వన్డే సీరిస్ క్రికెట్ టోర్నీకి నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం మహిళ ప్రపంచకప్లో భారత జట్టు తరుపున నిలకడగా రాణించింది. 14వికెట్లు తీసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు మరీ ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి క్రికెట్ క్రీడాకారిణి శ్రీచరణికి రూ.10లక్షలు ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన శ్రీచరణి ప్రపంచ కప్‌లో విశేష ఆటతీరు ప్రదర్శన, ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికా టీమ్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించడాన్ని గుర్తు చేశారు. ప్రపంచస్థాయిలో జిల్లా ఖ్యాతిని నిలబెట్టిన నల్లపురెడ్డి శ్రీచరణికి తనవంతుగా రూ.10లక్షలు ప్రోత్సాహక బహుమతి అందివ్వనున్నట్లు ‘సాక్షి’కి ఎంపీ మేడా రఘునాథరెడ్డి ధ్రువీకరించారు. తొలిసారి ప్రపంచ కప్ సాధించిన మహిళా క్రీడాకారులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నజరానా ఇస్తూనే గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగాలు అప్పగించాయని తెలిపారు. అదేస్థాయిలో క్రీడా ఆణిముత్యం శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవవించాలని ఆయన డిమాండ్ చేశారు.
హెడ్ పోస్టాఫీసు నుంచి 7రోడ్లు మీదుగా రాజీవ్‌మార్గ్ వరకు భారీ ర్యాలీ
సాయంత్రం వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో సత్కారం
ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా క్రికెట్ అసోసియేషన్
నేడు కడపకు శ్రీచరణి!


