ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు
కడప కార్పొరేషన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే రూ.2.27లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని సహజ వనరులను దోచుకుకుంటున్నారని ఆరోపించారు. కాగా పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఉన్నతమైన లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి, వాటి నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.8300కోట్లు రుణ సదుపాయం కూడా కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లె మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని టెండర్లు పిలిచారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని పార్టీలు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. పులివెందుల మెడికల్‌కాలేజీలోని ఆధునిక పరికరాలను గుంటూరు, కర్నూలుకు తరలించడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. ప్రభుత్వానికి భయం పుట్టేలా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. లేకుంటే ప్రభుత్వ పాఠశాలలను కూడా అమ్మేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
కూటమి ప్రభుత్వంలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. రైతులు పండించిన ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదని, వారికి అన్నదాత సుఖీభవ కింద రూ.40 వేలు రావాల్సి ఉంటే రూ.5వేలు మాత్రమే ఇచ్చారన్నారు. మోంథా తుఫాను వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు పాక సురేష్, పులి సునీల్ కుమార్, త్యాగరాజు, పి. ప్రసాద్‌రెడ్డి, షఫీవుల్లా, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
18 నెలల్లోనే రూ.2.27లక్షల కోట్లు అప్పు చేశారు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి


