రెండో శనివారం పాఠశాలలు నిర్వహించాలి
కడప ఎడ్యుకేషన్: ఈనెల 8వ తేదీ రెండవ శనివారం పాఠశాలలను నిర్వహించాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. మోంఽథా తుపాన్ వర్షాల కారణంగా అక్టోబర్ 27, 28,29 తేదీలలో పాఠశాలలను సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో డిసెంబర్ 13వ తేదీ, ఫిబ్రవరి 14వ తేదీలలోని రెండవ శనివారాల్లో కూడా ఖచ్చితంగా పాఠశాలలను నిర్వహించాలని డీఈఓ పేర్కొన్నారు.
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చెన్నూరులో అత్యధికంగా 37.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా కడపలో 32, పోరుమామిళ్లలో 26.6, గోపవరంలో 23.4, వేములలో 17, సికెదిన్నెలో 15.4 , బి.మఠం, వేంపల్లిలలో 10.2, కాశినాయనలో 8.2 , అట్లూరులో 8, సిద్దవటంలో 4.6, పెండ్లిమర్రిలో 4.2, ఖాజీపేటలో 3.4 , వల్లూరులో 2.4 , వీఎన్‌పల్లిలో 1.4, చక్రాయపేటలో 1, బద్వేల్‌లో 0.8 మి.మీ వర్షం కురిసింది.
రాజంపేట టౌన్: రాజంపేట ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 10న ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ జిల్లా కన్వీనర్ రామ్మూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన నిరుద్యోగ, యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ గ్రేడ్–1 కార్యదర్శి కె.రామకృష్ణ, సోములవారిపల్లె గ్రామ పంచాయతీ గ్రేడ్–1 కార్యదర్శి ఎం.రాజేంద్రప్రసాద్ రెడ్డిలను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణ పంచాయ తీ పోర్టల్‌కు సంబంధించిన హౌస్‌హోల్డ్ అసెస్‌మెంట్ జాబితాలో ఒకటే మొబైల్ నంబర్ పలు వాటికి జోడించడంతో కార్యదర్శులపై ఈ చర్య లు తీసుకున్నారు. కార్యదర్శులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఈ నెల 8న జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్ర టరీ నారాయణ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో జిల్లా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్‌ల మహిళలకు పురుషులకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెయిట్ లిఫ్టర్లు తమ ఐడీ ప్రూప్‌లతో డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాల వెయిట్ లిప్టింగ్ కోచ్ శివశంకర్‌రెడ్డిని సంప్రదించాలని కోరారు.
కడప రూరల్: జిల్లాలో 9, 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు పీఎం యశస్వి సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ ఫర్ ఓబీసీ, ఈబీసీ అండ్ డీఎన్ టీ పథకం కింద అర్హులైన విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం.అంజల తెలిపారు. గతేడాది మార్కుల ఆధారంగా 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.75 వేలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ 1.25 లక్షలు ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. అర్హులైన వారు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
రాజుపాళెం: మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లాలలోని శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వరస్వామి ఆలయాలకు రూ.7,66,466ల ఆదాయం వచ్చింది. గురువారం ఆలయాల్లోని హుండీలను పర్యవేక్షణ అధికారి, ప్రొద్దుటూరు ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆలయ ఈఓ కేవీ రమణ ఆధ్వర్యంలో లెక్కించగా రూ.7,25,866 ఆదాయం వచ్చిందని తెలిపారు. 1400 కిలోల పెసరబేడలతో కూడిన బియ్యాన్ని వేలం పాట వేయగా కిలో రూ.29 చొప్పున రూ.40,600 ఆదాయం వచ్చిందన్నారు. వెల్లాల ఆలయాలకు సంబంధించిన భూములను వేలం పాట నిర్వహించగా సరైన పాట రానందున వాయిదా వేశామని తెలిపారు.


