క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

Nov 6 2025 8:12 AM | Updated on Nov 6 2025 8:12 AM

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

రూ. 6,28,000 నగదు, 8 సెల్‌ ఫోన్లు, 4 బ్యాంకు పాసుపుస్తకాలు స్వాధీనం

నిందితులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు

బెట్టింగ్‌ నిర్వాహకులు

ఎంతటి వారైనా వదిలేదిలేదు

జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్‌ విశ్వనాథ్‌ వెల్లడి

కడప అర్బన్‌ : ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టును రట్టు చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ తెలిపారు. బుధవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠా సభ్యులు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కోసం తమకు కరెంట్‌ అకౌంట్లు కావాలని చెప్పి ఈనెల 3 వ తేదీన చాపాడు మండలం, చిన్నగురవలూరు గ్రామానికి చెందిన పెదమల్ల జగన్‌ అనే వ్యక్తి ద్వారా వివిధ బ్యాంకులలో కరెంట్‌ అకౌంట్లు ఓపెన్‌ చేయించారన్నారు. అవి ఫ్రీజ్‌ కాగా మరిన్ని అకౌంట్లు కావాలని వారు అడుగగా అందుకు జగన్‌ సహకరించలేదన్నారు. దీంతో వారు అతనిపై దాడి చేశారన్నారు. బాధితుడు ప్రొద్దుటూరు 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారన్నారు. విచారణలో బెంగళూరులో పీజీ నడుపుతున్న నిందితులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన వీర శంకర్‌, చంద్ర అనే వ్యక్తులు రాయల్‌బుక్‌..365.కామ్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా బెట్టింగ్‌ లావా దేవీల కోసం బ్యాంక్‌ అకౌంట్లు అవసరం కావడంతో వారు చెన్న కృష్ణ, నరేంద్ర, మేరువ హరి, సుధీర్‌ కుమార్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, రవి తేజ అనే వారిని సంప్రదించి వారి ద్వారా బ్యాంక్‌ అకౌంట్లు ఓపెన్‌ చేయించుకున్నారని తెలిపారు. వారికి కమీషన్లు ఇస్తూ వారి ద్వారా విస్తృతంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ క్రమంలో వీరంతా కలిసి మొత్తం 16 బ్యాంక్‌ అకౌంట్ల ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌కు చెందిన అక్రమ లావాదేవీలు చేసినట్లు తేలిందన్నారు. దీంతో ఆయా బ్యాంకుల వారిని అకౌంట్ల లావాదేవీలను పొందుపరచమని కోరామన్నారు. ప్రస్తుతానికి బ్యాంకుల ద్వారా తెలిసిన సమాచారం మేరకు బెట్టింగ్‌కు సంబంధించి రూ. 8.7 లక్షలు ఫ్రీజ్‌ అయ్యాయన్నారు. ఇలా అనుమానాస్పద లావాదేవీలు జరిపిన అన్ని అకౌంట్లను ఫ్రీజ్‌ చేయమని ఆయా బ్యాంకులను కోరినట్లు తెలిపారు. ఈ ముఠా గురించి కచ్చితమైన సమాచారం అందడంతో ఆరుగురు నిందితులను ప్రొద్దుటూరులో అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8 సెల్‌ఫోన్లు, అక్రమ లావాదేవీలకు వాడిన 4 బ్యాంకు పాస్‌ బుక్కులు, ఇటీవల జరిగిన ఇండియా–ఆస్ట్రేలియా, మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ల సందర్భంగా నిర్వహించిన బెట్టింగ్‌ మొత్తం రూ 6.28 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామన్నారు. వీరిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన ప్రొద్దుటూరు డీఎస్పీ పి. భావన, 2 టౌన్‌ సీఐ సదా శివయ్య, రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగ భూషణం, ఎస్‌ఐలు ధనుంజయుడు, ఓ. రాఘవేంద్ర రెడ్డి, సిబ్బందిని అభినందించారు. వారికి రివార్డులను అందజేస్తామన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితులైన వీర శంకర్‌, చంద్ర పరారీలో ఉన్నారని వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్‌ బాబు, ఎస్‌బీ డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, సీఐలు సదాశివయ్య, నాగభూషణం, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement