అప్పులు చేస్తున్నా.. అమలుకాని హామీలు
చింతకొమ్మదిన్నె : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి మంగళవారం అప్పులు చేయడం సర్వసాధారణంగా మారిందని, ఇప్పటికీ రెండు లక్షల 15 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినా ఆ మేరకు రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు జాడ లేదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం చింతకొమ్మదిన్నె మండలం కడప నగరం 18వ డివిజన్ బయనపల్లెలో జరిగిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కూడా అప్పులు చేసినప్పటికీ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమం కోసమే నిధులు ఖర్చు పెట్టారన్నారు. ప్రస్తుత చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులు, ఆస్తులను అమ్మకానికి పెట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ముఖ్యంగా యువతకు, మహిళలకు అనేక హామీలు ఇచ్చి ఆచరణలో అమలు చేయకుండా కేవలం భ్రమలు కల్పించే చంద్రబాబు స్వార్థ ఆలోచనలతోనే కుటిల పరిపాలన చేస్తున్నారన్నారు. మొదటి ఏడాది పరిపాలనలో ఎలాంటి సంక్షేమ హామీలు అమలు చేయకుండా, రెండవ సంవత్సరంలో రైతులకు సంబంధించి హామీ మేరకు 20వేల రూపాయలు ఇవ్వకుండా అరకొరగానే హామీలు అమలు చేశారన్నారు. మహిళలకు సంబంధించి ఆరు ఉచిత సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒకటి, రెండు మాత్రమే ఇచ్చారని, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా నైపుణ్య శిక్షణ తీసుకోండని ఉచిత సలహాలతో మోసం చేస్తున్నారన్నారు. మహిళలకు నెల నెలా 1500 చొప్పున సంవత్సరానికి 18000 అందిస్తామని చెప్పి అమలు చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గత 100 సంవత్సరాల కాలంలో కేవలం 12 మెడికల్ కళాశాలలు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండగా జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు తీసుకొని వచ్చి 50 నుంచి 100 ఎకరాల వరకు భూములు కేటాయించి అవసరమైన చోట ప్రైవేటు వారి నుంచి సేకరించి నిర్మాణాలు సాగించారన్నారు. కొన్ని పూర్తయి అడ్మిషన్ దశకు చేరుకోగా మరికొన్ని చివరి స్థాయిలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇలాంటి దశలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మెడికల్ అడ్మిషన్లు వద్దని నిర్వహించలేమని చేతులెత్తేయడం, పేద విద్యార్థులు వైద్యులయ్యే అవకాశాన్ని దెబ్బతీశారన్నారు. 17 మెడికల్ కళాశాలలను ఆర్థిక కారణాలు సాకుగా చూపి ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన చేయడం దుర్మార్గమన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కడప నగర డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, 47 వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలల అవసరాలను ప్రజలకు వివరిస్తూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కార్యక్రమంలో కడప నగర వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు దీప్తి, వైఎస్సార్‌సీపీ చింతకొమ్మదిన్నె మండల కన్వీనర్ గూడా ప్రభాకరరెడ్డి, సుధాకరరెడ్డి, కమలకూరి, శ్రీనివాసరెడ్డి, కళాయాదవ్, సురేంద్రారెడ్డి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి


