హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలోని నాగలకట్ట వీధిలో 2017 సంవత్సం జనవరి 19న జరిగిన మునగాల రవి అనే వ్యక్తి హత్య కేసు లో లక్కిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మాధవి అనే నిందితులకు కడప ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి జి. దీనబాబు గురువారం జీవిత ఖైదుతో పాటు ఇరువురికి 1000 రూపాయలు జరిమానా విధించినట్లు పట్టణ సీఐ సురేష్ బాబు తెలిపారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన మునగాల రవి మాధవి అనే మహిళకు రూ. 5 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బులు అడుగుతున్నాడని ఆమె కక్షగట్టి నాగలకట్ట వీధిలో వస్తుండగా సూర్యనారాయణరెడ్డితో కలిసి ఇనుపరాడ్డు, కట్టెలు రాళ్లతో దాడి చేయడంతో మునగాల రవి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నాగరాజు కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ టి. సర్కార్ విచారణ చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. గురువారం కోర్టు నిందితులిద్దరికీ జీవితఖైదు, జరిమానా విధిస్తూ తీర్పుచెప్పింది.


