పెద్ద ఉరుసుకు వేళాయె
ఉరుసు వివరాలు
కడప సెవెన్‌రోడ్స్: ప్రఖ్యాత కడప పెద్ద దర్గా పెద్ద ఉరుసుకు వేళయింది. శాంతియుత సూఫీ తత్వాన్ని ప్రబోధిస్తున్న ఈ దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలు ఈనెల 5వ తేది నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా దర్గా నిర్వాహకులు విశేష ఏర్పాట్లు చేశారు. ఉరుసు నేపఽథ్యంలో దర్గాతోపాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఉత్సవాలకు తరలి రానున్న భక్తులకు దర్గా ఆధ్వర్యంలో విడిది, అన్నదాన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఉరుసు సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో విద్యుద్దీపాలను అలంకరించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పారిశుధ్యం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ అధికారులు నగరంలోని రైల్వేస్టేషన్ నుంచి దర్గా వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం విశేషం.
● ఈనెల 5న గంధం కార్యక్రమంలో భాగంగా ఉదయం దర్గా నుంచి బాదుల్లా సాహెబ్ మకాన్ వరకు ఫకీర్ల ఊరేగింపు సాంగ్యం,సాయంత్రం పీఠాధిపతుల దివ్యాసనం, ధ్యాన తపస్సు. రాత్రి గంధం ఊరేగింపు, ఫాతెహా సమర్పణ, ఖవ్వాలీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
● 6న ఇదార–యే–అమీనియా చిస్తీయా వార్షిక నివేదిక, రాత్రి 9 గంటలకు ఉరుసు మహోత్సవం, ఎద్దులబండ్ల చౌహరీ ఖలీఫాల చాందినీ, గంధం ఊరేగింపు, చదివింపులు, ఖవాలీ మొదలైన పవిత్ర పుణ్య కార్యక్రమాలు జరుగుతాయి.
● 7న తహలీల్ ఫాతెహా ఉత్సవంలో భాగంగా ప్రసాద సమర్పణ, సంబంధిత ప్రార్థనలు, రాత్రి ప్రముఖ విద్వాంసులతో కవిసమ్మేళనం (ముషాయిరా) జరుగుతుంది.
● 8న రాత్రి 10గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు సమాఖానీ సజ్జదనషీన్ పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో ఖవాలీ, ఖురాన్ పఠనం, తదితర కార్యక్రమాలు ఉంటాయి.
● 9వ తేదీ ఫకీర్లతో పీఠాధిపతి వాటర్ గండిలోని హజరత్ మస్తాన్ స్వామివారి దర్శనం, జెండా ప్రతిష్ట, చదివింపులు నిర్వహిస్తారు.
● 10న ఫకీర్ల సంఘాలకు జర్రా ప్రసాదం, దస్సకీ ఆవాజ్, పండితులు,విద్వాంసులు, యాత్రికులు, భక్తుల తిరుగు ప్రయాణం.
నేడు గంధోత్సవం
వేలాదిగా తరలి రానున్న భక్తజనం
నగరమంతటా విద్యుద్దీప శోభ
వారం రోజులపాటుకొనసాగనున్న ఉత్సవాలు


