పరిహారం ఇవ్వకుంటే ఆందోళన
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ఉల్లి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు చొప్పున ఇస్తామన్న పరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెండు వారాల్లో పరిహారం అందకపోతే కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, చెన్నూరు, వీఎన్ పల్లె ఎంపీపీలు చీర్ల సురేష్‌యాదవ్, రఘునాథరెడ్డి ఎంపీతో కలిసి కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్బంగా ఎంపీ అవినాష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జిల్లా రైతులు సుమారు 17 వేల ఎకరాల్లో ఉల్లి పంట నష్టపోయారని తెలిపారు. గతనెలలోనే తాము ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ప్రభుత్వం ద్వారా నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు చొప్పున పరిహారం ఇప్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు అడగ్గా ఫైలు ముఖ్యమంత్రి టేబుల్‌పై ఉందని, త్వరలో జీఓ విడుదల అవుతుందని చెప్పడం సరికాదన్నారు. 2022 రబీ నుంచి 2024 ఖరీఫ్ వరకు రైతులకు ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా కింద రూ.173 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని తెలిపారు. ఇంతవరకు ఒక్క రైతు ఖాతాలో కూడా బీమా మొత్తం జమకాలేదని ఆరోపించారు. ఏ మండలానికి ఎంత మంజూరైందో చెప్పాలని అడిగినా అధికారుల వద్ద వివరాలు లేవన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మినుము, శనగ, వరి తదితర పంటలన్నీ పూర్తిగా నీట మునిగాయన్నారు. ఇందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలా ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నప్పుడు రైతులు మళ్లీ పంట సాగు చేసుకోవడానికి వీలుగా 90 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం కూడా 90 శాతం సబ్సిడీతో విత్తనాలు తక్షణమే రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బోర్ల కింద వరి పంట సాగు చేసిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, గతనెల 26వ తేది మంత్రి ప్రకటించినప్పటికీ ఇంతవరకు జిల్లాలోని 19 కొనుగోలు సెంటర్లలో ఎక్కడా ఒక్క గింజ కూడా సేకరించలేదన్నారు. దీంతో చేసేది లేక రైతులు ఇప్పటికే 70 శాతం పంటలు తక్కువ ధరలకు విక్రయించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో క్వింటాలు పత్తి రూ. 14–16 వేలు ఉండేదని, నేడు రూ. 5 వేలకు రైతులు విక్రయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు హృషికేశ్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, సీహెచ్ వినోద్‌కుమార్, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షఫీ తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో జమ కాని బీమా
90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి
వరిధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలి
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


