పోలీస్‌స్టేషన్ స్థల పరిశీలన
కొండాపురం: తాళ్లప్రొద్దుటూరులోని పోలీస్‌స్టేషన్ స్థల విషయమై మంగళవారం కలెక్టర్ శ్రీధర్ మండలంలో పర్యటించారు. ప్రభుత్వ విప్.ఆదినారాయణరెడ్డి, జీఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ కలెక్టర్ శాంతమ్మ, ఆర్డీఓ సాయిశ్రీతో కలిసి తాళ్ల ప్రొద్దుటూరు లేఅవుట్‌ను పరిశీలించారు. కాగా స్థానిక ఎమ్మెల్యే అండతో కొందరు నిర్వాసితుల ముసుగులో పునరావాస కాలనీలో ఖాళీ స్థలం కావాలని అర్జీ రూపంలో రెవిన్యూ శాఖ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం తాళ్లప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్ స్థలం పరిశీలన చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా తాళ్లప్రొద్దుటూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్‌కు పడమటి వైపున డాట్ లాండ్ లో రెండు ఎల్‌పీ నెంబర్లు ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. మరోవైపు తమ సమస్యలు చెప్పుకుందామని నిర్వాసితులు ఆశతో అక్కడి వచ్చారు. అధికారులు వచ్చింది ప్రజా సమస్యల కోసం కాదని.. నేతల అవసరాల కోసం వచ్చారని తెలుసుకుని నివ్వెరపోయారు.
గండికోట జలాశయం పరిశీలన
కలెక్టర్ శ్రీధర్ గండికోట జలాశయాన్ని పరిశీలించారు. నీటి మట్టం, ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను జీఎన్‌ఎస్‌ఎస్ ఏఈ చిన్న కొండారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండికోట టన్నెల్ ద్వారాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.


