వివాహిత ఆత్మహత్య కేసులో యువకుడి అరెస్టు
బద్వేలు అర్బన్ : వివాహితను వేధించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన ఓ యువకుడిని సోమవారం బద్వేలు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక అర్బన్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ లింగప్ప వెల్లడించారు. బి.మఠం మండలం మల్లెగుడిపాడు గ్రామానికి చెందిన మన్నెం మల్లేశ్వరి బి.కోడూరు మండలం తంగేడుపల్లె సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ పట్టణంలోని కోటిరెడ్డినగర్‌లో నివసిస్తుండేది. గత నెల 26న మల్లేశ్వరి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ఆమె తండ్రి సుబ్బరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. విచారణలో గతంలో మల్లేశ్వరి దిరసవంచ సచివాలయంలో పనిచేస్తున్న సమయంలో అదే సచివాలయంలో వలంటీర్‌గా పనిచేస్తున్న పీరయ్య అనే యువకుడు మల్లేశ్వరితో చనువుగా ఉంటూ ఆమెకు వివాహమైన తర్వాత కూడా తనతో చనువుగా ఉండాలని, లేకుంటే గతంలో తనతో సన్నిహితంగా మెలిగిన ఫొటోలను, వాట్సాప్ చాట్‌లను నీ భర్తకు పంపుతానని బెదిరిస్తుండేవాడు. దీంతో ఒత్తిడికి గురైన మల్లేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇదే సమయంలో పీరయ్య దిరసవంచ గ్రామ పంచాయతీ వీఆర్‌ఓ ఓబుల్‌రెడ్డి మహేశ్వర్‌రెడ్డి వద్దకు వెళ్లి మల్లేశ్వరి చనిపోవడానికి తానే కారణమని నేరం అంగీకరించాడు. ఈ మేరకు వీఆర్‌ఓకు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పీరయ్యను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్‌ఐ జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


