లేఖ రాసుకో... బహుమతి అందుకో
● తపాల శాఖ ఆధ్వర్యంలో పోటీలు
● జాతీయస్థాయిలో మొదటి బహుమతి రూ.50 వేలు
● దరఖాస్తులకు ఆఖరు తేదీ డిసెంబర్ 8
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : స్టాంపుల సేకరణపై ఆసక్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా భారతీయ తపాల శాఖ పోటీలను నిర్వహిస్తోంది. 2025 –26 సంవత్సరానికి గాను ధాయి ఆఖర్ ఉత్తరాల పోటీలను జాతీయ స్థాయిలో చేపడుతున్నారు. ‘లెటర్ టు మై రోల్ మోడల్’ అనే అంశంపై ఇంగ్లీష్, హిందీ, అన్ని ప్రాంతీయ భాషల్లో ఉత్తరాలు రాసేలా అవకాశం కల్పించారు. జిల్లాలో 18 ఏళ్ల లోపు, 18 ఏళ్లు దాటిన వారిని రెండు విభాగాలుగా విభజించి ఈ పోటీలను నిర్వహించనున్నారు.
చేతితో రాసిన లేఖలకే అనుమతి...
ఎన్వలప్ కేటగిరిలో ఏ4 సైజు పేపర్‌లో 1000 పదాల కంటే ఎక్కువ మించకుండా రాయాలి. ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డు (ఐ ఎల్ సి) కేటగిరిలో 500 పదాల కంటే ఎక్కువ ఉండకూడదు. చేతితో రాసిన లేఖలకు మాత్రమే అనుమతిస్తారు. డిసెంబర్ 8 తర్వాత పోస్ట్ చేసిన ఉత్తరాలు పోటీల్లో పాల్గొనేందుకు అంగీకరించరు. 18 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాలు పైబడిన వారు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఇలా రాసిన ఉత్తరాలను సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, కడప, వైయస్సార్ కడప జిల్లా– 516001 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. రాసే ఉత్తరాల్లో సంతకంతో పాటు వయసు రాయాలి. చిరునామాపైన ఎంట్రీ ఫర్ ధాయ్ ఆఖర్ 2025 –26 అని రాసి పోస్ట్ చేయాలి. ఈ పోటీలకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 8 వరకు గడువు ఉంది.
బహుమతులు ఇలా...
జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిస్తే రూ.50వేలు, ద్వితీయ స్థానానికి రూ.25 వేలు, తృతీయ స్థానానికి రూ.10 వేలు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు, ద్వితీయ స్థానానికి రూ.10 వేలు, తృతీయ స్థానానికి రూ.5వేలు ఇస్తారు.


