నియమ, నిష్టలకే.. అయ్యప్ప అనుగ్రహం
కడప సిటీ : నియమ, నిష్టలతో అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్ర చేస్తే అయ్యప్ప అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఏటా కార్తిక మాసం ఆరంభం నుంచే అయ్యప్ప స్వాములు మాలధారణ ప్రారంభించి 41 రోజులు మండల దీక్ష.. ఆపై ఇరుముడితో శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గురుస్వామి మార్గదర్శనం ఇందులో ప్రత్యేకం. భక్తులు మాలధారణ చేసిన తరువాత మనసు, మాట, శరీరం పవిత్రతను కాపాడాలి. రోజూ స్వామియే శరణం అయ్యప్పా శరణు ఘోష చెప్పాలి. ఉపవాసం, అహింస, మద్యపానం, మాంసాహారం, పొగత్రాగడం పూర్తిగా నిషేధించడమేగాక, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి (ఉదా: పాలు, పండ్లు, ఆకు కూరలు మొదలైనవి.). మాలధారణ కాలంలో బ్రహ్మచర్యం పాటించి.. నిత్యం ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి. దీపం వెలిగించి, అయ్యప్ప స్తోత్రాలు నిష్ఠతో పఠించాలి. గుడిలో జరిగే పడిపూజ, అంబులం పూజ, మండల పూజ, గ్రామోత్సవం వంటి కార్యమాలలో విరివిగా పాల్గొనాలి.
గురుస్వామి పాత్ర
అయ్యప్ప మాలధారణలో గురుస్వామికి ప్రత్యేకత ఉంటుంది. భక్తులను సరైన మార్గంలో నడిపించే ఆధ్యాత్మిక మార్గదర్శకుడు ఆయన. భక్తులకు అయ్యప్ప మాలధారణ, నియమాలు, ఆచారాలు ఎలా పాటించాలో బోధిస్తాడు. మాలధారణలో సహాయం చేసి మాలను భక్తుడిచే ధరింపజేస్తాడు. స్వామియే శరణం అయ్యప్పా అని జపం చేయిస్తాడు. 41 రోజుల నియమాలు ఎలా పాటించాలో, ఏవి చేయకూడదో వివరిస్తాడు. తన శిష్యుల ఆచరణ, ఆలోచన, నడవడిని పరిశీలించి పవిత్రత కాపాడేలా చేస్తాడు. శబరిమల యాత్రలో గురుస్వామి బృందానికి నాయకుడై మార్గం చూపుతూ అన్ని పూజలు, ఆచారాలు నిర్వహిస్తాడు. అనుభవజ్ఞుడైన ఆయన భక్తులకు ఆధ్యాత్మిక ధైర్యం, శాంతి, సహనం నేర్పిస్తాడు. యాత్ర పూర్తయ్యాక మాలను తీసేయడానికి గురుస్వామి సహకారం అవసరం ఉంటుంది.
అయ్యప్ప స్వామి అనుగ్రహం
మాలధారణ చేసిన తర్వాత 41 రోజుల మండల దీక్ష నిష్టగా, భక్తిగా పూర్తి చేసిన భక్తుడు ఆధ్యాత్మికంగా పవిత్రుడవుతాడు, మనసు, శరీరం, ఆత్మ శుద్ధి చెందుతుంది, అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందుతాడని, దీక్షను సచ్చ్ఛిదానందంగా పాటించిన వారికి అంతరంగ శాంతి లభిస్తుందని, పూర్వ జన్మ పాపాలు, చెడు అలవాట్లు తొలగి కొత్త జీవితం మొదలవుతుందని భక్తులు నమ్ముతారు. సాత్విక జీవన విధానం వల్ల శారీరకంగా ఆరోగ్యవంతులవుతారు. అయ్యప్ప స్వామి దృష్టి కరుణ పడితే, జీవితంలో శుభం, సౌఖ్యం, విజయాలు లభిస్తాయని, బ్రహ్మచర్యం, ఉపవాసం, సత్యం పాటించడం వల్ల మనసు స్థిరమవుతుంతని, మండల దీక్షను పూర్తిగా పాటించడంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని చెబుతారు. అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ జీవించినవారికి మోక్ష మార్గం కలుగుతుంది.
పెద్దపాదం విశిష్టత
నిజమైన భక్తి, నియమం, వినయం కలిగిన వారికి నా కృప తప్పక లభిస్తుంది. పెద్దపాదం అనేది శబరిమల అయ్యప్ప స్వామి యాత్రలో అత్యంత పవిత్రమైన మరియు చారిత్రాత్మక ప్రదేశం. ఇది అయ్యప్ప స్వామి యాత్రికులు దివ్య దర్శనానికి వెళ్ళే మార్గంలో ఉండే ఒక ఆధ్యాత్మిక స్థలం. పెద్దపాదం అంటే అయ్యప్ప స్వామి అడుగుల ముద్రలు ఉన్నాయని భక్తుల నమ్మకం. ఈ ప్రదేశాన్ని చేరి భూమిని నమస్కరిస్తారు. ఈ ప్రదేశం చేరుకునే వరకు భక్తులు కష్టమైన అరణ్య మార్గాలు, పర్వత మార్గాలు దాటి వెళ్తారు. అది వారి భక్తి, ధైర్యం, సహనానికి పరీక్షగా భావిస్తారు. పెద్దపాదం వద్ద స్వామిని ధ్యానిస్తూ భక్తులు మోక్షం కోసం ప్రార్థిస్తారు. అక్కడి వాతావరణం ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది.
శబరిమల యాత్ర ఇలా..
పెద్దపాదం మీదు అయ్యప్ప దర్శనానికి వెళ్లే వారంతా ముందుగా అయ్యప్ప యాత్ర ప్రారంభ స్థానం ఎరుమేలి చరుతారు. ఇక్కడ పెట్టా తుల్లల్ పూజ, నృత్యం చేస్తారు. తరువాత పాదయాత్ర మొదలవుతుంది. అరణ్యమార్గం పెరియ మీదుగా భక్తులు స్వామి పేరు జపిస్తూ నడుస్తారు. కఠినమైన పర్వతం కరిమల ఎక్కడం భక్తులకు నిజమైన పరీక్ష. అనంతరం పంపా చేరుకుని నదీ స్నానం చేస్తారు. అక్కడి నుంచి సన్నిధానం వైపు ఎక్కే దారిలో పెద్దపాదం వస్తుంది. ఇక్కడ భక్తులు దీపం వెలిగించి దేవుడిని ప్రార్థిస్తారు. మోకాళ్లపై కూర్చుని పూజచేస్తారు. అనంతరం అయ్యప్ప ఆలయానికి చేరి స్వామియే శరణం అయ్యప్పాఅంటూ దర్శనం పొందుతారు.
కార్తీక మాసం ఆరంభం నుంచి మాలధారణ
పవిత్రతతో ఉన్నప్పుడే ఫలితం
35 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల ధారణ చేస్తున్నా. నియమ, నిష్టలతో దీక్ష పూర్తి చేసినపుడు అయ్యప్ప స్వామి అనుగ్రహం, ఫలితం లభిస్తుంది. నేను ప్రస్తుతం కడప హోసింగ్ బోర్డు కోదండరామాలయం ధర్మకర్తగా కొనసాగుతున్నా. 2010 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా మండలం కాలంపాటు కడప నగరం హొసింగ్ బోర్డు కాలనీలోని కోదండరామాలయంలో అన్నదానం నిర్వహిస్తున్నాం. రోజు మధ్యాహ్నం అన్నదానం(బిక్ష) ఉంటుంది.
– దేసు వేంకటరెడ్డి, గురుస్వామి, హౌసింగ్‌బోర్డు కాలనీ, కడప
నియమ, నిష్టలకే.. అయ్యప్ప అనుగ్రహం
నియమ, నిష్టలకే.. అయ్యప్ప అనుగ్రహం


