ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. పిల్లల పేరుతో ఆస్తి రాయించాలంటూ మృతదేహాన్ని తీసుకెళ్లకుండా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి చెందిన వివాహిత సునీత మంగళవారం సాయంత్రం విద్యుత్ షాక్‌తో మృతిచెందింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కావ్య, హరినాథ్ ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సునీత అమ్మగారి ఊరు మైదుకూరు మండలంలోని తిప్పిరెడ్డిపల్లె. సునీత మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులందరూ జిల్లా ఆస్పత్రి వద్దకు వచ్చారు. సునీత భర్త శ్రీకాంత్‌కు కొంతమేర పొలం ఉంది. పొలాన్ని పిల్లల పేరుతో రాయించాలని సునీత తరపు బంధువులు అడిగారు.
ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లకుండా తిప్పిరెడ్డిపల్లె వాసులు అడ్డుకున్నారు. పోలీసులు నచ్చ చెప్పినా మహిళలందరూ వాహనానికి అడ్డుగా నిల్చున్నారు. రూరల్ ఎస్‌ఐ రాజు, టూ టౌన్ ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డితోపాటు పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చివరకు పిల్లల పేరుతో పొలం రాయిస్తున్నట్లు తండ్రి శ్రీకాంత్ అగ్రిమెంట్ రాయడంతో సునీత బంధువులు శాంతించారు. అనంతరం సునీత మృతదేహాన్ని చౌడూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్న
బంధువులు
జిల్లా మార్చురీ వద్ద ఉద్రిక్తత


