అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి
జమ్మలమడుగు : జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిధిలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తరతర అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. జమ్మలమడుగు స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లు, సబ్ డివిజన్‌లోని సీఐలు, ఎస్‌ఐలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని హైవేలపై రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలని, రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించాలని సూచించారు. కేసులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గండికోట వైష్టవి హత్య కేసు గురించి ఆరాతీశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
ప్రొద్దుటూరు క్రైం: నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన బాషా సయ్యద్‌పాల్ (51), సయ్యద్ ఆసిఫ్ (19) దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 200 కుటుంబాలు ప్రొద్దుటూరులో జీవిస్తున్నాయి. వీరంతా పీఓపీ, గ్లాస్ వర్క్, తదితర పనులు చేకుంటూ సుమారు 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. వీరిలో సయ్యద్‌పాల్ కుమారుడి వివాహం గురువారం పెంచలకోనలో జరుగనుంది. దీంతో బంధువులతో పాటు సయ్యద్‌పాల్ బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు నుంచి కార్లలో బయలుదేరారు. అనంతసాగరం మండలంఉప్పలపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొంది. ఈ ఘటనలో సయ్యద్‌పాల్, సయ్యద్ రఫిలు అక్కడిక్కడే మృతి చెందగా జబిఉల్లా, ఆదిల్‌పాల్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆత్మకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడిన వెంటనే దారిన వెళ్తున్న వ్యక్తులు క్షతగాత్రుల ఫోన్ తీసుకొని బంధువులకు సమాచారం అందించారు. ప్రొద్దుటూరులోని సయ్యద్‌పాల్ బంధువులు కొందరు గురువారం ఉదయం పెంచలకోనకు వెళ్లాలని భావించారు. ప్రమాద వార్త తెలియడంతో ప్రొద్దుటూరులో ఉంటున్న ఉత్తరప్రదేశ్ వాసులు రోధించసాగారు. పలువురు వారి బంధువులు బుధవారం రాత్రి బయలుదేరి వెళ్లారు.
అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి


