యూనిట్ లీడర్‌కు ఉత్తమ పురస్కారం
కడప ఎడ్యుకేషన్ : రోబోటిక్స్, ఏఐ, స్టెమ్, యుఈపీపై భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ కార్యాలయం ఏర్పాటుచేసిన వర్క్ షాప్‌లో కడప జిల్లాకు చెందిన యూనిట్ లీడర్ అహమ్మద్ సగినాల ప్రతిభ చూపారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ఆళ్వాస్ విద్యా సంస్థలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా పలువురితో పోటీపడి అహమ్మద్ ప్రతిభ చూపించి విజయం సాధించారు. జాతీయ కార్యాలయ గౌరవ అతిథులు మధుసూదన్ ఆవల, షిండీయ, అనలేంద్ర శర్మ, కృష్ణస్వామి, ప్రతిమాకుమార్, ఛటర్జీ, భారత్‌రాజ్ ఎంపీ కెప్టెన్ బ్రిజేష్‌చౌటా, ఆళ్వాస్ సంస్థల అధినేత మోహన్‌ఆళ్వా, వివేక్ ఆళ్వా, ప్రభాకర్ భట్టు చేతుల మీదుగా అహమ్మద్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు.
వీలునామా ప్రకారమే మఠాధిపతిని నియమించాలి
కడప రూరల్ : పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి వీలునామా ప్రకారమే మఠాధిపతిని నియమించాలని వీర బ్రహ్మేంద్రస్వామి ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆలెపు శ్రీనివాసులు అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి 420 ఏల్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. విశ్వ గురువుగా, కాలజ్ఞాన రచయితగా భగవంతుని స్వరూపంగా స్వామి కొలువబడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి పవిత్ర మఠంలో మఠాధిపతి నియామకంలో అలజడులు జరగడం తగదన్నారు. దివంగత వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి వీలునామా ప్రకారం గోవిందస్వామి మఠాధిపతిగా అర్హుడని అభిప్రాయపడ్డారు. ఈయనకు మఠం సంప్రదాయాలు, పద్ధతులు తెలుసనన్నారు. గోవిందస్వామి మాట్లాడుతూ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి తనకు వేదాలు నేర్పేవారని, కాలజ్ఞానం గురించి బోధించేవారని తెలిపారు. తాను వీరభోగ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ధర్మపరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
చీటింగ్ కేసు నమోదు
కడప అర్బన్: కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న దంపతులు తనకు స్థలం ఇప్పిస్తామని రూ.54 లక్షలను తీసుకుని మోసం చేశారని భాగ్యనగర్ కాలనీకి చెందిన శివరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. రామచంద్రారెడ్డి, శ్యామల దంపతులు బాధిత ఉద్యోగి శివరామిరెడ్డికి స్థలం ఇప్పిస్తామంటూ 54 లక్షల తీసుకున్నారు. ఇప్పటివరకూ బదులీయకపోవడంతో.. మోసం చేశాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారిస్తున్నారు.
యూనిట్ లీడర్‌కు ఉత్తమ పురస్కారం


