ఆస్తి ఇవ్వలేదనే తండ్రి, పిన్ని హత్య
● ఆన్‌లైన్ గేమ్‌లతో చేసిన అప్పు తేర్చలేక తనయుడి ఘాతుకం
● విలేకరులతో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
జమ్మలమడుగు : ఈనెల 26వ తేదీన మండలంలోని మోరగుడిలో జరిగిన నాగప్ప, పెద్దక్కల హత్య కేసును పోలీసులు చేధించారు. ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి చేసిన అప్పులు తీర్చేందుకు ఆస్తి ఇవ్వలేదనే కోపంతో కుమారుడు కుడేటి వెంకటేస్ తన తండ్రి, పిన్నిలను హతం చేసినట్లు విచారణలో తేల్చారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హత్య వివరాలు వెల్లడించారు. నాగప్ప కుమారుడు కుడేటి వెంకటేష్ స్థానిక ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో క్యాషినో గేమ్స్ ఆడి విపరీతంగా అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఆస్తులు పంచాలంటూ తండ్రి నాగప్పను కోరాడు. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడితే నేను అప్పులు తీర్చాలా.. ఇచ్చేది లేదంటూ ససేమిరా అన్నారు. పిన్ని పెద్దక్క కూడా తాము కష్టపడి సంపాదించుకున్నది.. నీకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇది మనసులో పెట్టుకున్న వెంకటేష్ కోపంతో ఊగిపోయాడు. ఇద్దరినీ హతమార్చాలని ముందస్తు ప్రణాళిక చేసుకున్నాడు. శనివారం రాత్రి నాగప్ప, పెద్దక్క ఒకేచోట నిద్రిస్తున్నారు. ఈ సమయంలో పట్టుడు కట్టెతో ఇద్దరినీ దారుణంగా కొట్టి హతమార్చాడు. కేసును నీరు కార్చేందుకు మిరపపొడి చల్లి.. ఇంటి తలుపులు, బీరువా తాళాలు పగులగొట్టాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసును ఛాలెంజ్‌గా తీసుకుని తక్కువ రోజుల్లోనే చేధించారు. విచారణలో తండ్రి, పిన్నిలను హతమార్చానని కుమారుడు వెంకటేష్ తెలిపినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసు చేధించినందుకు సీఐ నరేష్‌బాబు, ఎస్‌ఐలు రామకృష్ణ, హైమావతిలతోపాటు, కానిస్టేబుల్ నాగేంద్ర, కృష్ణారెడ్డి, మహేష్, గంగాధర్, సుధాకర్ సురేష్ ,ప్రవీణ్‌లకు ఎస్పీ రివార్డు ప్రకటించారు. నిందితుడు వెంకటేష్‌కు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


