నాగమునెమ్మ మృతదేహం లభ్యం
రాజుపాళెం : రాజుపాళెం మండలం వెల్లాల గ్రామ సమీపంలోని కుందూనదిలో శనివారం గల్లంతైన నాగమునెమ్మ (76) మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఉదయం నుంచి ప్రొద్దుటూరు ఫైర్ సిబ్బంది బోట్ సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వెల్లాల పాతవంతెనకు సమీపంలో ఆ వృద్ధురాలి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించడంతో వెంటనే బోటులో ఒడ్డుకు చేర్చారు. పెద్దముడియం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన గొంగటి రామసుబ్బారెడ్డి, గొంగటి నాగమునెమ్మ అనే వృద్ధ దంపతులు జీవితంపై విరక్తి చెందడంతో పాటు అనారోగ్య కారణాలతో శనివారం వెల్లాల కుందూనది పాత వంతెనపై నుంచి నదిలోకి దూకిన విషయం విదితమే. నది ఉధృతిలో కొట్టుకుపోతున్న రామసుబ్బారెడ్డిని స్థానికుడైన గుర్రప్ప ఒడ్డుకు చేర్చగా నాగమునెమ్మ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయింది. ఆదివారం లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నాగమునెమ్మ మృతదేహం లభ్యం


