నిర్లక్ష్యంగా బైక్ నడిపిన యువకుడిపై కేసు నమోదు
వేంపల్లె : నిర్లక్ష్యంగా మోటార్ బైక్ నడిపిన దర్బార్ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. శనివారం సాయంత్రం వేంపల్లెలోని పులివెందుల – గండి బైపాస్ రోడ్డులోని మదీనాపురం సమీపంలో దర్బార్ అనే యువకుడితో పాటు మరో ఐదుగురు యువకులు 3 మోటార్ బైకుల్లో అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పెద్దగా శబ్దం చేయడంతో పాటు మోటార్ బైకు ముందు చక్రాలను లేపి వెనుక చక్రాలపై మోటార్ బైకు నడిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ నేపథ్యంలో మోటార్ బైకులను నడిపిన యువకులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే వారిపై కేసు నమోదు చేసి మోటార్ బైకులపై చర్యలు తీసుకోవాలని పులివెందుల మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
మైలవరం : మండల పరిధిలోని కర్మలవారిపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (56) కరెంటు షాక్‌తో మృతి చెందింది. ఆదివారం లక్ష్మీదేవి తాను ఉతికిన దుస్తులను ఇంట్లోనే ఆరబెట్టుకుంటుండగా కడ్డీలకు విద్యుత్ కనెక్షన్ తగలడంతో షాక్‌కు గురైంది. భర్త మాధవరెడ్డి భార్యకు కరెంటు షాక్ తగిలిందని భావించి కాపాడే ప్రయత్నం చేశాడు. అతను కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ షాక్‌కు గురైన లక్ష్మీదేవిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధృవీకరించారు. మైలవరం ఎస్‌ఐ శ్యాంసుందర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
ఆటోను ఢీకొన్న కారు
కొండాపురం : మండల పరిధిలోని పెంజి అనంతపురం గ్రామ సమీపంలో తాడిపత్రి–కడప జాతీయ రహదారిపై ముద్దనూరు వైపు వెళ్లే ఆటోను కారు ఢీ కొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలైనట్లు కొండాపురం ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు సిద్దవటం మండలం ఎగువపేట గ్రామానికి చెందిన చంద్ర ఓబులేసు తన కుమారుడు శశి విఖ్యాత్‌కు మూర్ఛ వస్తుండటంతో కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామంలో వాయి బిళ్ల వేయించుకొనేందుకు వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో పెంజి అనంతపురం గ్రామ సమీపంలో తాడిపత్రి వైపు నుంచి వచ్చే కారు వెనుక నుంచి ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నిర్లక్ష్యంగా బైక్ నడిపిన యువకుడిపై కేసు నమోదు
నిర్లక్ష్యంగా బైక్ నడిపిన యువకుడిపై కేసు నమోదు


