సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : పట్టణంలోని కోటిరెడ్డినగర్‌లో నివసిస్తూ బి.కోడూరు మండలం తంగేడుపల్లె సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తుండే మన్నెం మల్లేశ్వరి (28) శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బి.మఠం మండలం మలుగుడుపాడుకు చెందిన సుబ్బరామిరెడ్డి, ఇంద్రావతిల రెండవ కుమార్తె అయిన మల్లేశ్వరిని మూడేళ్ల క్రితం పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెలకు చెందిన రామనరసారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఈయన అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని రామాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. అయితే శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మల్లేశ్వరి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. భర్త ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉండటంతో తలుపును పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా మల్లేశ్వరి ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. మృతురాలి తండ్రి సుబ్బరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పరామర్శించిన
మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ..
మృతురాలు మన్నెం మల్లేశ్వరి స్వగ్రామం బి.మఠం మండలం మలుగుడుపాడు కావడంతో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆదివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మల్లేశ్వరి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, బి.మఠం మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు సుబ్బారెడ్డి, మండల నాయకులు వెంకటరామిరెడ్డి, వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


