శైవ క్షేత్ర సమాహారం పుష్పగిరి | - | Sakshi
Sakshi News home page

శైవ క్షేత్ర సమాహారం పుష్పగిరి

Oct 27 2025 8:20 AM | Updated on Oct 27 2025 8:20 AM

శైవ క

శైవ క్షేత్ర సమాహారం పుష్పగిరి

కార్తీక మాసం నదీ స్నానం.. సకల పాపహరణం

వల్లూరు : త్రిమూర్తుల్లో ఒకరుగా , భక్తులు కోరిన కోర్కెలను తీర్చే భోలా శంకరునిగా ప్రఖ్యాతి గాంచిన పరమ శివుడు ఒక్కో క్షేత్రంలో ఒక్కో పేరుతో పిలువ బడుతూ భక్తులకు దర్శనమిస్తుండడం పరిపాటి. దాదాపు ప్రతి చోట లింగాకారంలోనే ఆయన దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు. అరుదుగా ఒకటి రెండు చోట్ల మాత్రమే ఉమా శంకరుడుగా, ఉమా మహేశ్వరుడుగా విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అయితే పుష్పగిరిలో మాత్రం పరమ శివునికి విశిష్ట స్థానం వుంది. శివ కేశవ అభేద క్షేత్రమైన పుష్పగిరిలో ప్రసిద్ధి గాంచిన అనేక శివాలయాలు మనకు దర్శనమిస్తాయి. అందులో శంకరుడు ఒక్కో ఆలయంలో ఒక్కో పేరున పిలువ బడుతూ భక్తులచే పూజలందుకుంటుండడం విశిష్టత సంతరించుకుందని చెప్పవచ్చు.

108 శివలింగాలు..

పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి 108 శివలింగాల ప్రతిష్టితంగా పేరుగాంచింది. ఎన్నో ఆలయాలకు నెలవై ఆలయ నగరిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రాచీన కాలంలో ఒక చోళరాజు 108 శివలింగాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించాడని ప్రతీతి. ఇక్కడ ఇప్పటికీ కనిపిస్తున్న ఎన్నో శిథిలమైన ఆలయాలు, లింగాలు, వృషభ విగ్రహాలు, శిల్పాలు, పాను పట్టాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి.

పుష్పగిరి గ్రామంలో వైద్యనాథేశ్వరుని ఆలయ ప్రాంగణంలో త్రికుటేశ్వర స్వామి, భీమలింగేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి మొదలైన శివాలయాలు ప్రశస్తి గాంచాయి. కొండపైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో సాక్షి మల్లేశ్వర , సంతాన మల్లేశ్వర ఆలయాలతో బాటు రుద్రపాద ఆలయాలు భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్నాయి.

శ్రీరామ చంద్రునిచే పూజలందుకున్న వైద్య నాథేశ్వరుడు..

పురాణ పురుషుడైన శ్రీ రామ చంద్రుడు సాక్షాత్తూ తన చేతుల మీదుగా పూజలు చేసిన శివలింగంగా పుష్పగిరిలోని వైద్యనాథేశ్వరుడు ప్రశస్తిగాంచాడు. వనవాసంలో సీతను అపహరించిన రావణుని సంహరించేందుకు లంకకు వెళుతూ శ్రీరాముడు ఈ ప్రాంతంలో కొంత కాలం వున్నాడు. ఆయన ప్రతి రోజూ ఇక్కడి వైద్యనాథున్ని పుష్పాలతో పూజించేవాడు. ఈ సందర్భంలో ముందు రోజు పూజకు ఉపయోగించిన పూలను తీసి ఇక్కడి పెన్నా నదిలో వేసేవారు. ఆ పూల రాశి క్రమంగా కొండంత పెరిగి నీటిలో తేలియాడింది. దీంతో పుష్పగిరి అనే పేరు వచ్చిందని ఒక కథ ప్రచారంలో వుంది.

త్రికుటేశ్వర స్వామి ఆలయం..

వైద్యనాథ ఆలయ సముదాయంలో వాయువ్యాన మూడు శివుని ఆలయాల సమూహమైన త్రికుటేశ్వర స్వామి ఆలయం వుంది. ఇక్కడ తూర్పు ముఖంగా వున్న గుడిలో దేవతా మూర్తిని త్రికుటేశ్వరుడని, దక్షిణ ముఖంగా ఉన్న గుడిలోని దేవతా మూర్తిని భీమేశ్వరుడని, ఉత్తర ముఖంగా వున్న గుడిలోని దేవతా మూర్తిని ఉమా మహేశ్వరుడని ిపిలుస్తారు. త్రికుటేశ్వర స్వామి ఆలయానికి తూర్పు వైపున భీమ లింగేశ్వర ఆలయం వుంది. వైద్యనాథ ఆలయం ప్రాంగణంలోనే నైరుతి మూలన తూర్పు ముఖంగా రాఘవేశ్వరాలయం వుంది. ప్రస్తుతం ఈ ఆలయంలో శివ లింగం ఏమైందో తెలియడం లేదు.

పుష్పగిరి కొండపైన ఆలయాలు

పుష్పగిరి కొండపైన గల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ సముదాయంలో చెన్నకేశవ, సంతాన మల్లేశ్వర, ఉమా మల్లేశ్వర ఆలయాలు మూడూ ఒకే ముఖ మండపాన్ని కలిగి వుండడం విశేషం. ఇక్కడి సంతాన మల్లేశ్వర ఆలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఉమా మహేశ్వర ఆలయంలో పరమేశ్వరుడు వృషభారూఢుడై పార్వతీ దేవి (ఉమ) తో కూడి ఉమా మహేశ్వరుడుగా విగ్రహ రూపంలో వుంటాడు. చెన్న కేశవ ఆలయ ప్రాంగణంలో ఈశాన్యంలో సాక్షి మల్లేశ్వర ఆలయం వుంది.

రుద్రపాద ఆలయం

కొండపై చెన్నకేశవ ఆలయ ప్రధాన గోపుర ద్వారానికి దక్షిణం వైపున రుద్ర పాద ఆలయం వుంది. నీటిపై తేలుతున్న కొండను త్రిమూర్తులైన విష్ణు , ఈశ్వర, బ్రహ్మలు ముగ్గురూ తలో చోట తొక్కి పట్టి అణిచారని ఒక కథ ప్రచారంలో వుంది. ఆ సందర్భంగా ఏర్పడిన శివుని పాదమే ఈ రుద్రపాదమని భక్తుల విశ్వాసం.

చెన్న కేశవ ఆలయ ప్రాంగణానికి కుడి వైపున కమలా శాంభవేశ్వర ఆలయ సముదాయం వుంది. శిథిలమైన ఈ ఆలయ సముదాయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. ఇందులోని ఒక ఆలయంలో పంచలింగాలతో కూడిన విగ్రహం వుంది. మరో ఆలయంలో శివ లింగం వుంది.

చెన్న కేశవ ఆలయ ప్రాంగణ మెట్లకు కుడి వైపున కొండకు మలచబడ్డ ఆలయంలో పాపవినాశేశ్వరుడు వున్నాడు.

కొండపై దుర్గమ్మ ఆలయం సమీపంలో ఉమామహేశ్వర ఆలయం వుంది.

ఇంద్రనాథేశ్వర ఆలయం..

పెన్నా నదికి ఉత్తరం వైపున కొండ భాగంలో పశ్చిమంలో చింతలపత్తూరు వద్ద ఇంద్ర నాథేశ్వర ఆలయం వుంది.

పుష్పాలేశ్వర ఆలయం..

పుష్పగిరి కొండపై శిఖరాగ్రాన పుష్పాచలేశ్వర స్వామి ఆలయం వుంది. కాల క్రమంలో శిథిలావస్థకు చేరిన ఈ ఆలయ పునరుద్ధరణకు కొందరు భక్తులు తమ శాయ శక్తులా కృషి చేస్తున్నారు.

దక్షిణ కాశిగా ఖ్యాతి..

పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలో గ్రామానికి కొండకు మధ్య ప్రవహిస్తున్న పవిత్ర పెన్నా నది కాశీలోని గంగా నది వలె దక్షిణ దిశగా ప్రవహిస్తూ తూర్పు దిశగా అర్థ చంద్రాకారంలో సాగిపోతుంది. దీంతో ఇది దక్షిణ కాశిగా ఖ్యాతి గడించింది.

పరమ శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం..

కార్తీక మాసం పరమ శివునికి ఎంతో ప్రీతి పాత్రమైన మాసం. ఈ మాసంలోని సోమవారాలలో, పౌర్ణమి దినాన స్వామిని దర్శించుకుని, అభిషేకాలను నిర్వహించి పూజలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ సోమవారాలలో ఆలయాలను దర్శించి శివునికి పూజలు చేస్తారు.

నేడు మొదటి కార్తీక సోమవారం

కొండపైన వున్న శివ లింగం

వైద్యనాథేశ్వర ఆలయ ప్రాంగణంలో నంది విగ్రహం

సంతాన మల్లేశ్వర స్వామి మూల విరాట్‌

పుష్పగిరిలో ఒక్కరోజు ఉపవాసంతో వుండి ఆయా దేవతా మూర్తులను దర్శిస్తే విశేష ఫలం లభిస్తుందని, సూర్య గ్రహణ సమయంలో కానీ, అక్షయ తృతీయ రోజున కానీ సంకల్ప పూర్వకంగా ఇక్కడి పినాకినీ నదిలో స్నానమాచరించి శివకేశవులను దర్శిస్తే వంద అశ్వమేథ యాగాలు చేసిన ఫలం లభిస్తుందని నానుడి. వైశాఖ, కార్తీక, మాఘ మాసాలలో కానీ, మిగిలిన మాసాలలో ఏకాదశి, పౌర్ణమి రోజులలో పినాకినీలో స్నానమాచరిస్తే అనాయాసంగా కై వల్యం లభిస్తుందని పినాకినీ మహత్యం చెబుతోంది.

శైవ క్షేత్ర సమాహారం పుష్పగిరి 1
1/3

శైవ క్షేత్ర సమాహారం పుష్పగిరి

శైవ క్షేత్ర సమాహారం పుష్పగిరి 2
2/3

శైవ క్షేత్ర సమాహారం పుష్పగిరి

శైవ క్షేత్ర సమాహారం పుష్పగిరి 3
3/3

శైవ క్షేత్ర సమాహారం పుష్పగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement