కర్నూలు బస్సు ప్రమాదంలో చంద్రబాబే మొదటి ముద్దాయి
– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై కర్నూలులో జరిగిన బస్సు దగ్ధం ఘటన ప్రమాదం కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయని, కూటమి ప్రభుత్వం 20 మంది ప్రయాణికులను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో సీఎం చంద్రబాబే ప్రఽథమ ముద్దాయని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యమే ఈ ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. జాతీయ రహదారి సమీపంలోని బెల్ట్‌షాపులో మద్యం తెల్లవారుజామునే అమ్మడంపై ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటీఎం (ఎనీ టైం మందు) తరహాలో మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను హరిస్తోందన్నారు. ఫిట్‌నెస్ సహా ఏ అనుమతులూ లేకుండా జాతీయ రహదారిపై బస్సు తిరగడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీరాష్ట్రంలో మద్యం పాలసీ సక్రమంగా లేదని మేం ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంది. నకిలీ మద్యం, విపరీతంగా బెల్టు షాపులతో ప్రజల ప్రాణాలను హరిస్తున్నారుశ్రీ అని దుయ్యబట్టారు. ఈ ఘటనతో పాటు మద్యం వల్ల ఇకపై ఏ ప్రమాదం జరిగినా అది ప్రభుత్వ నిర్లక్ష్యంగానే భావించి డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తానన్నారు. వీటిని హత్యలుగా భావించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే కేసులు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు.


