డ్రగ్స్ రహిత సమాజం కోసం నడుం బిగిద్దాం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : మత్తు పదార్థాలైన డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం అందరం కలిసికట్టుగా నడుం బిగిద్దామని జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో తెలిసీ తెలియని వయస్సులో యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారన్నారు. డ్రగ్స్, గంజాయి వాడినా, అమ్మినా నేరమని, దానికి కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. యువత సన్మార్గంలో నడిచి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరణాల.శివకుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విజయ్, నగర ఉపాధ్యక్షుడు పెద్దన్న పాల్గొన్నారు
వృద్ధురాలి అదృశ్యం
కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌కు ఈనెల 26వతేదీన తన కుమార్తె ఇంటికి రాజుపాలెం మండలం అర్కటవేములకు చెందిన గంటల నాగమ్మ(82)అనే వృద్ధురాలు వచ్చింది. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయిందని అల్లుడు వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసినవారు పోలీసులకుగానీ, వేణుగోపాల్ సెల్ నెంబర్: 80740 22422కు తెలియజేయాలని పోలీసులు కోరారు.
చెరువులో వ్యక్తి గల్లంతు
అట్లూరు : చెరువులో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి గల్లంతైన ఉదంతం మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొండూరు ప్రభాకర్ (54) డప్పు కళాకారుడుగా జీవనం సాగిస్తున్నాడు. బోడిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందడంతో ఆదివారం ఆమె అంత్యక్రియలకు డప్పు వాయించేందుకు ప్రభాకర్ వెళ్లాడు. ఆ మహిళ అంత్యక్రియల అనంతరం ప్రభాకర్ ఇంటికి వస్తూ కాళ్లు, చేతులు కడుక్కొనేందుకు సమీపంలోని వేమలూరు చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయి గల్లంతయ్యాడు. దీంతో అక్కడున్న వారు బంధువులకు సమాచారం ఇచారు. బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు, తహసీల్దార్‌కు సమాచారం అందించారు. స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ, ఆర్‌ఐ రమణ, వీఆర్‌ఓ సుబ్బన్న బద్వేలు అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను పిలిపించి ఆదివారం చీకటి పడే వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గజ ఈతగాళ్లు మళ్లీ ఉదయం గాలిస్తామని తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఐదుగురు ఆడపిల్లలు కాగా, వారిలో ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి.
జాతీయ స్థాయి అబాకస్‌లో సత్తా చాటిన నాగార్జున విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్ : జాతీయస్థాయి అబాకస్ పోటీలలో కడప నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి క్యూబాటిక్ అబాకస్ పరీక్షల్లో 5వ తరగతికి చెందిన తబితాశ్రేష్ఠ, 4వ తరగతికి చెందిన మోక్షజ్ఞలు ద్వితీయ బహుమతులను సాధించగా 5వ తరగతికి చెందిన భారతి తృతీయ బహుమతిని సాధించారు. అలాగే 6వ తరగతికి చెందిన రేయాన్‌ఖాన్, 5వ తరగతికి చెందిన మోక్షితారెడ్డి, 3వ తరగతికి చెందిన సోహిత్, లక్ష్మి కాస్వీరెడ్డిలు నాలుగో స్థానంలో నిలిచారు. మరో నాలుగు మెరిట్ బహుమతులను పొందారు. జాతీయస్థాయి అబాకస్ పోటీలో ప్రతిభ చాటిన విద్యార్థులను నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ శివ తులశమ్మ, డైరెక్టర్ శివప్రసాద్‌రెడ్డి, హెచ్‌ఎం క్రిష్ణారెడ్డి, హెడ్‌మిసెస్ సుశీలదేవి అభినందించారు.
కుటుంబ సభ్యులకు
మహిళ అప్పగింత
మైలవరం : మండల పరిధిలోని బుచ్చంపల్లి గ్రామానికి చెందిన మూడే తేజేశ్వరిని ఎస్‌ఐ శ్యాంసుందర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన మాట్లాడుతూ తేజేశ్వరి జూన్ 19వ తేదీన భర్త కేశాలు నాయక్‌తో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో పక్కింటి వారితో ఉపాధి పనికి వెళుతున్నానని చెప్పి వెళ్లింది. అయితే ఇంటికి భార్య తిరిగి రాకపోవడంతో భర్త కేశాలు నాయక్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఆచూకీ లభ్యం కావడంతో ఆదివారం కుటుంబ పెద్దలను పిలిపించి అప్పగించారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం నడుం బిగిద్దాం
డ్రగ్స్ రహిత సమాజం కోసం నడుం బిగిద్దాం
డ్రగ్స్ రహిత సమాజం కోసం నడుం బిగిద్దాం
డ్రగ్స్ రహిత సమాజం కోసం నడుం బిగిద్దాం


