ప్రత్యేక బలగాలు సిద్ధం
● అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేస్తే తక్షణం సహాయక చర్యలు
● ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్: జిల్లాలో ’మోంథా’ తుఫాను నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో 3 ప్రత్యేక బృందాలతో పాటు ప్రతి పోలీసు సబ్ డివిజన్ లో ఒక రెస్క్యూ టీమ్ సిద్ధం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలకు అవసరమైన లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, సహాయచర్యలు నిమిత్తం తాళ్లు, బాటన్ లతో సంసిద్ధంగా ఉంచారు. నదులు, వాగులు, వంకల పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్.పి పోలీసు అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక శిబిరాలు, పునరావాస కేంద్రాలు గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉధృతంగా ప్రవహించే నదీ పరీవాహక ప్రాంతాలలో ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ప్రయాణించేందుకు అనువుకాని మార్గాల్లో, నీట మునిగిన రహదారుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నదుల్లో ఈత కొట్టేందుకు ఎవ్వరూ వెళ్లొద్దని ప్రజలను సూచించారు.


