రూ.8 లక్షల విలువైన నగల బ్యాగు అప్పగింత
● ఆటోలో పోగొట్టుకున్న వృద్ధ దంపతులు
● సకాలంలో స్పందించిన పోలీసులు
కడప అర్బన్ : రూ.8 లక్షల విలువైన బంగారు, వెండి నగలున్న బ్యాగును ఆటోలో మరచిపోయి వదిలేసి వెళ్లిన వృద్ధ దంపతులకు తిరిగి గంటలోపే వాటిని అప్పగించి కడప చిన్నచౌక్ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకెళితే... శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కడప నగరం, శ్రీనగర్ కాలనీలో నివాసం ఉన్న దాసరి సంటెన్న(65), దాసరి గంగులమ్మ (60) దంపతులు వారి మనుమడితో కలిసి నంద్యాలలో ఉన్న తమ కుమారుడు డాక్టర్ రమేష్ ఇంటికి వెళ్లేందుకు ఇంటి వద్ద నుంచి ఆటోలో ఆర్టీసీ బస్టాండుకు బయలుదేరారు. ఆర్టీసీ బస్టాండ్‌లోకి వచ్చేసరికి అప్పటికే బస్టాండ్‌లో నంద్యాల వైపు వెళ్లే బస్సు సిద్ధంగా ఉండడంతో ఆ గాబరాలో బంగారాన్ని ఉంచిన తమ బ్యాగును ఆటో వెనుక భాగంలో వదిలి గబగబా ఆటో దిగి బస్సు ఎక్కారు. కొంతసేపటికి తమ బ్యాగును ఆటోలో మరిచిపోయిన విషయం వారు గ్రహించారు. వెంటనే ఆర్టీసీ బస్టాండ్ అవుట్ పోస్టులో విధులలో ఉన్న కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డిని ఆశ్రయించారు. కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డి ఈ విషయాన్ని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎ.ఓబులేసు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధికారుల సూచనల మేరకు వెంటనే రంగంలోకి దిగిన కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డి, బ్లూకోల్ట్ సిబ్బంది ఆర్టీసీ బస్టాండ్ , పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ద్వారా వచ్చిన ఆనవాళ్లను బట్టి ఆటోను పాతబైపాస్ రోడ్డులో గుర్తించి, ఆటో వెనుక భాగంలో బంగారంతో ఉన్న బ్యాగులోని మొత్తం 8 తులాల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. వాటిని చిన్నచౌక్ సీఐ ఎ. ఓబులేసు బాధితులైన దాసరి సంటెన్న, దాసరి గంగులమ్మ దంపతులకు అప్పగించారు. తక్షణమే స్పందించిన కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డిని, బ్లూకోల్ట్ కానిస్టేబుల్ ప్రసాద్ రెడ్డి, హోమ్ గార్డ్ గురివిరెడ్డిని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు.


