ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ఈశ్వరరెడ్డినగర్‌లోని ముక్తియార్ ఆయిల్‌మిల్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ మహీర్ (14) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహీర్ శనివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఈశ్వరరెడ్డినగర్‌లోని బైపాస్‌రోడ్డులో ఆడుకుంటున్నాడు. అదే వీధిలో ఉంటున్న తెలిసిన వారి ట్రాక్టర్ వెళ్తుండగా తాను కూడా వస్తానని మహీర్ ట్రాక్టర్ ఇంజిన్ వద్ద ఎక్కి కూర్చున్నాడు. ఈ క్రమంలో రామేశ్వరం బైపాస్‌రోడ్డులోని రెండు కుళాయిల దారి వద్దకు వెళ్లగానే ప్రమాదవశాత్తు మహీర్ ట్రాక్టర్ చక్రాల కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహీర్ తండ్రి గైబూసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ రాజగోపాల్ తెలిపారు.
సూది మందు వికటించి మహిళ మృతి
బ్రహ్మంగారిమఠం : మండలంలోని మల్లేపల్లె పంచాయతీ చెంచయ్యగారిపల్లెకు చెందిన బాలగాని రమాదేవి (45) అనే వివాహిత ఆర్‌ఎంపీ వేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గత వారం రోజులుగా రమాదేవికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లింగాలదిన్నెపల్లె కాలనీలోని ఆర్‌ఎంపీ చిట్టిబాబు దగ్గరకు శనివారం సాయంత్రం వెళ్లింది. ఆయన ఆమెకు అలర్జీ ఉందని ఇంజక్షన్ వేశారు. కొద్ది సేపటికి నోట నురుగు రావడంతో భయపడి రమాదేవిని అక్కడే ఉంచి వైద్యశాలకు తాళం వేసి వెళ్లిపోయాడు. ఆమె కుటుంబ సభ్యులు ఇంకా రాలేదని ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లారు. అక్కడ తలుపు వేసి ఉండడంతో కిటికీలో నుంచి చూడగా బల్లపై పడిపోయి రమాదేవి కనిపించింది. ఇంటికి వేసిన తాళాన్ని పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే రమాదేవి మృతి చెంది ఉంది. ఇంజక్షన్ వల్లే మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బి.మఠం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు మృతదేహాన్ని పరిశీలించారు. బి.మఠం పోలీసులు ఆర్‌ఎంపీ చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, పంచాయతీ ఉపసర్పంచ్ కొండారెడ్డిలు మృత దేహాన్ని సందర్శించారు.


