నేనూ జింకా రవి బాధితుడినే
ప్రొద్దుటూరు : గుర్రప్పస్వామి ఆటో ఫైనాన్స్ నిర్వాహకుడు జింకా రవి బాధితుల వరుసలో తాను కూడా ఉన్నానని జమ్మలమడుగు మున్సిపాలిటీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జె.ప్రసాద్ తెలిపారు. 2016లో తాను రూ.50వేలు తీసుకుని చెల్లించానన్నారు. తాను తీసుకున్న సమయంలో రూ.50వేలుకు బాండు రాయించుకోవడంతోపాటు సమయానికి వడ్డీ చెల్లించలేనని మూడు ఖాళీ చెక్కులు తీసుకున్నాడన్నారు. సమయం ప్రకారం తాను అసలు, వడ్డీ చెల్లించానని, బదిలీలో భాగంగా మైదుకూరుకు వెళ్లానన్నారు. 2017లో జింకా రవి రూ.5 లక్షలకు ఒక చెక్కు, రూ.8 లక్షలకు ఒక చెక్కు కోర్టులో ఫైల్ చేశాడన్నారు. మరో రూ.5లక్షల చెక్కును జింకా రవి బంధువు జింకా వెంకటసుబ్బయ్య కోర్టులో కేసు వేశాడన్నారు. గడువు ముగిసిన తర్వాత బాండు వెనుక అతనే జమ రాసుకుని కోర్టులో వేయడంతో సివిల్ కేసు ఫైల్ అయిందన్నారు. రూ.5లక్షలు, రూ.8లక్షలకు సంబంధించిన కేసులు కోర్టులో కొట్టివేశారని, మరో రూ.5లక్షలతోపాటు బాండ్ కేసు కోర్టులో నడుస్తోందన్నారు. పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి తమలాంటి బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
ఐపీ దాఖలు చేయలేదు : తన ఇంటికి సంబంధించి తాను ఐపీ దాఖలు చేయలేదని దొరసానిపల్లెకు చెందిన జింకా రవి అనే వడ్డీ వ్యాపారి ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షిలో ఇటీవల ప్రచురితమైన ‘ఖాళీ చెక్కులతో కాసుల బేరం’, ‘న్యాయం చేయండి’ వార్తలపై ఆయన స్పందించారు. అడ్వకేట్ ఫోర్జరీ సంతకాలతో ఐపీ దాఖలు చేసినట్లు తెలిసిందన్నారు. దీంతో తాను సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు విన్నవించగా కోర్టు వారు కేసును డిస్మిస్ చేశారని తెలిపారు. ఈ విషయంపై అడ్వకేట్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు బార్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. తన ఇంటిని ఎవరూ కొనలేదని, ఇప్పటికీ ఆ ఇంటిలో నివసిస్తున్నానని తెలిపారు. తాను ఉద్యోగులకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమేనని, డబ్బు తీసుకున్న ఉద్యోగులు సమయానికి చెల్లించకపోవడంతోనే తాను లీగల్ నోటీసు జారీ చేసి కేసు వేశానని తెలిపారు. తనపై తప్పుడు ప్రకటనలు చేసిన వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని తెలిపారు.


