నేరాలలో శిక్షల శాతం పెంచడమే లక్ష్యం
● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
● పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్షా సమావేశం
కడప అర్బన్ : జిల్లాలో నమోదయ్యే ముఖ్యమైన కేసులలో ముద్దాయిలను రిమాండ్‌కు తరలించే విషయంలోను, రిమాండ్ ఖైదీలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టులో హాజరు పరిచే విషయమై, అదే విధంగా కేసు విచారణ సందర్భంగా ఎదురయ్యే న్యాయ పరమైన సమస్యల గురించి, జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదై కోర్టుల్లో వివిధ దశల్లో ఉన్న కేసులకు సంబంధించిన పలు విషయాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో శనివారం జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ జిల్లాలో నమోదైన ముఖ్యమైన కేసులలో దర్యాప్తు మొదలుకొని కోర్టులలో ఆ కేసులు పూర్తయి నిందితులకు శిక్ష పడేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కేసులు ఫైలింగ్ చేసే విధానం తదితర విషయాలను చర్చించారు. సాక్ష్యాల సేకరణ, ప్రాపర్టీ సీజ్, అటాచ్‌మెంట్, కోర్టులలో ట్రయల్ జరిగే సమయంలో తలెత్తే సందేహాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నివృత్తి చేశారు. ఎప్పుడైతే నేరం చేసిన వారికి శిక్ష పడుతుందో అప్పుడే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తద్వారా ప్రజలకు పోలీసులపై, న్యాయస్థానంపై నమ్మకం కలుగుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఖదీరున్‌బీ, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ ఎస్.వినయ్ కుమార్ రెడ్డి, జిల్లాకు సంబంధించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


