పొలతల క్షేత్ర అభివృద్ధికి కృషి
పెండ్లిమర్రి: పొలతల పుణ్యక్షేత్రం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం పెండ్లిమర్రి మండలం పొలతల క్షేత్రంలో దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణాస్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రంలో చేపట్టాల్సిన పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని దేవదాయశాఖ అధికారులకు సూచించారు. కమలాపురం నియోజకవర్గంలోని 90 ఆలయాలకు ధూప–దీప నైవేద్యం కింద నిధులు మంజూరు చేశామన్నారు. అనంతరం క్షేత్రంలో నాలుగు జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషన్‌ర్లు, ఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పొలతల దేవస్థానం చైర్మన్‌గా సి.రాజారెడ్డిని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేలు టీడీపీ ఇన్‌చార్జి రితేష్‌రెడ్డి, దేవదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
పుష్పగిరిని సందర్శించిన మంత్రి
వల్లూరు: ప్రముఖ పుణ్య క్షేత్రమైన పుష్పగిరి కొండపై గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ చెన్న కేశవ స్వామి, శ్రీ సంతాన మల్లేశ్వర స్వాములను దర్శించుకుని పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ పుష్పగిరి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.


