బద్వేలు టీడీపీలో ఐవీఆర్‌ కాల్‌కలం! | - | Sakshi
Sakshi News home page

బద్వేలు టీడీపీలో ఐవీఆర్‌ కాల్‌కలం!

Oct 24 2025 7:36 AM | Updated on Oct 24 2025 7:36 AM

బద్వే

బద్వేలు టీడీపీలో ఐవీఆర్‌ కాల్‌కలం!

సర్వే పేరుతో అభిప్రాయ సేకరణ

రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ శ్రేణులు

పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు

అట్లూరు : ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిర్వహిస్తున్న ఐవీఆర్‌ సర్వే బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో దివంగత మాజీమంత్రి బిజివేముల వీరారెడ్డి మనుమడు రితీష్‌రెడ్డి, డీసీసీ బ్యాంకు చైర్మన్‌ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య చిచ్చు రేపింది. బద్వేలు నియోజకవర్గం నుంచి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఇటు జిల్లా, అటు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా రాణించారు దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి. ఆయన మరణానంతరం 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె కుమార్తె విజయమ్మ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2004లో డీసీ గోవిందరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో అక్కడ ఎస్సీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను ప్రధాన పార్టీల నాయకులు తీసుకున్నారు. అయితే ఎస్సీ రిజర్వుడు స్థానాన్ని వరుసగా డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే కై వసం చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న విజయమ్మ ఆమె తనయుడు రితీష్‌రెడ్డి పార్టీ ఉనికిని కాపాడుకునే పనిలో పడ్డారు. ఈ పరిస్థితిలో తల్లీ తనయులకు తోడుగా నేనున్నానంటూ అట్లూరు మండలం వేమలూరు గ్రామానికి చెందిన రైల్వే కాంట్రాక్టర్‌ మంచూరు సూర్యనారాయణరెడ్డి టీడీపీలో చురుకై న పాత్ర పోసిస్తూ వచ్చారు. దీంతో ఆయనకు టీడీపీ అధిష్టానం డీసీసీ చైర్మన్‌ పదవి కట్టబెట్టింది. కట్టబెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లను కలిసి పార్టీ కోసం కష్టపడిన తమను పక్కన పెట్టడంతో పాటు బద్వేలులో పార్టీ ఓటమికి విజయమ్మ, ఆమె తనయుడు రితీష్‌రెడ్డి కారకులని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఐవీఆర్‌ కాల్‌తో కలకలం.. బద్వేలులో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీలో ఇటీవల జరిపిన ఐవీఆర్‌ ఫోన్‌ కాల్‌ సర్వే మరింత సంక్షోభాన్ని సృష్టించిందనే చెప్పవచ్చు. బద్వేలు టీడీపీ ఇన్‌చార్జిగా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం తెలియజేయండి అంటూ రితీష్‌రెడ్డి అయితే 1 నొక్కండి.. డీసీసీ బ్యాంకు చైర్మన్‌ సూర్యనారాయణరెడ్డి అయితే 2 నొక్కండి అంటూ ఐవీఆర్‌ సర్వే కాల్‌ నియోజకవర్గ ప్రజలకు వస్తుండటం కలకలం రేపింది. వీరారెడ్డి వారసులకు కాకుండా ఇతరులకు ఇన్‌చార్జి పదవి ఎలా ఇస్తారంటూ విజయమ్మ, రితీష్‌రెడ్డి వర్గం వాదిస్తుంటే.. పార్టీ కోసం కష్టపడుతూ ఖర్చు పెడుతున్న సూర్యనారాయణరెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాల్సిందే నంటూ మరో వర్గం తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితీష్‌రెడ్డి వర్గం ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రిని కలిసి దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన రితీష్‌రెడ్డినే ఇన్‌చార్జిగా కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. ఏదిఏమైనా ఐవీఆర్‌ సర్వే పుణ్యమా అని బద్వేలు టీడీపీ బీటలు వారిందనే చెప్పవచ్చు.

బద్వేలు టీడీపీలో ఐవీఆర్‌ కాల్‌కలం!1
1/1

బద్వేలు టీడీపీలో ఐవీఆర్‌ కాల్‌కలం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement