భర్తపై భార్య ఫిర్యాదు
కడప అర్బన్ : కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వక్కలపేటలో నివాసం ఉంటున్న రేవతికి, బాలాజీ నగర్‌కు చెందిన లోకేష్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తన భర్తతో పాటు, అత్తమామలు, అక్కా బావ వేధిస్తున్నారని ఆవేదన చెందుతూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కడప టూ టౌన్ ఎస్‌ఐ ఎస్‌కేఎం హుస్సేన్ ఐదుగురిపై వరకట్నం వేధింపు కేసు నమోదు చేశారు.
జార్జి క్లబ్‌లో పోలీసుల తనిఖీలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని జార్జికారోనేషన్ క్లబ్‌లో గురువారం సాయంత్రం త్రీ టౌన్ సీఐ వేణుగోపాల్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. క్లబ్‌లో పేకాట నిర్వహిస్తున్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. క్లబ్‌లో పేకాట నిర్వహించరాదని సీఐ క్లబ్ నిర్వాహకులకు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
యువకుడి అదృశ్యం
కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రం చెన్నయ్య వీధికి చెందిన షేక్ ఖాజా మొహిద్దీన్(26) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత నెల 16వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు తెలిపారు. తండ్రి మున్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఏఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
ఐదుగురు జూదరుల అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడంపల్లె దళితవాడలో పేకాట ఆడుతున్న ఐదుగురిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో టౌ టౌన్ ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 6390 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు.
రూ. 33 లక్షలకు ఐపీ దాఖలు
పీలేరు రూరల్ : పీలేరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కలికిరికి చెందిన దంపతులు రూ. 33 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. కలికిరి పట్టణం, రామ్‌నగర్ కాలనీకి చెందిన షేక్ ఖాదర్‌బాషా కలికిరిలో కూల్‌డ్రింక్స్, టీ దుకాణం నిర్వహిస్తూ కుటుంబం పోషించేవాడు. అలాగే కలికిరి, పరిసర ప్రాంతాల్లో భూములు లీజుకు తీసుకుని టమాట పంటసాగు చేసేవాడు, ఆయన భార్య షేక్ ముంతాజ్ ఇంటిలో చీరల వ్యాపారం నిర్వహించేది. ఖాదర్ బాషా 23 మంది వద్ద రూ. 17,76,500, ముంతాజ్ ఆరుగురి వద్ద రూ. 15,50,000 అప్పు చేసింది. వ్యాపారంలో నష్టం రావడంతో ఇద్దరూ ఐపీ దాఖలు చేశారు.


