భూములకు రక్షణ కల్పించండి
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా కలికిరి మండలం పేత్తగడ గ్రామ పంచాయతీ మజరా పాలెంకు చెందిన గుండ్లూరు రాజగోపాల్ తనకు ప్రాణహాని ఉందని, భూములను రక్షించాలని బుధవారం జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమ గ్రామంలో రెండు చింతచెట్లతో సహా సర్వే నెంబర్ 294లో 0.02 సెంట్ల భూమిని 1991లో కొనుగోలు చేశానన్నారు. అయితే ఇదే భూమిపై తమ గ్రామానికి చెందిన బందం గుర్రప్ప, అతని కుమారుడు బందం రాజు అలియాస్ పురుషోత్తంల కన్ను పడిందన్నారు. ఈ విషయమై తనను అనేకమార్లు అడిగినా తాను ఇవ్వనని చెప్పానన్నారు. అయితే ఈ నెల 21వ తేదీన తాను పొలం పనులకు వెళ్లగా బందం గుర్రప్ప, బందం రాజు, బందం రమణ, బందం రమేష్, బందం చెన్నకేశవులు మరికొందరు వ్యక్తులు తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారన్నారు. అంతేకాకుండా తనను బంధించి దాదాపు 40 సంవత్సరాల వయస్సు గల రెండు చింతచెట్లను దౌర్జన్యంగా, అక్రమంగా నరికివేశారన్నారు. దీంతో తమకు దాదాపు లక్ష రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. తనపై దాడి చేసే సమయంలో ప్రాణభయంతో గట్టిగా అరుపులు వేయడంతో పక్కనే ఉన్న మదన, గంగరాజులు వచ్చి వారి బారి నుంచి తనను కాపాడారన్నారు.


