జేఎల్‌ఎంకు విద్యుత్ షాక్
వేంపల్లె : వేంపల్లె మండల పరిధిలోని చింతలమడుగుపల్లె సబ్ స్టేషన్‌లో పనిచేస్తున్న గ్రేడ్–2 జేఎల్‌ఎం హరి నారాయణకు నేలవరం తండా వద్ద విద్యుత్ స్థంభం వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ షాక్ తగిలిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం జేఎల్‌ఎం హరినారాయణ లైన్ మెన్ నుంచి ఎల్‌సీ తీసుకొని విద్యుత్ స్థంభాన్ని ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ స్థంభంపై నుంచి కిందపడటంతో హరినారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా హరినారాయణ వెనుక భాగమంతా విద్యుత్ షాక్ తగిలి చర్మం కాలిపోయింది. స్థానికుల సహాయంతో 108 వాహనంలో హరి నారాయణను వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ప్రాథమిక చికిత్స అనంతరం కడపకు తీసుకెళ్లారు. లైన్ క్లియరెన్స్ ఇవ్వకుండానే విద్యుత్తు స్థంభాన్ని ఎక్కించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బంధువులు వాపోతున్నారు.
డిప్యుటేషన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
రాయచోటి టౌన్ : రాయచోటి డైట్ కళాశాలలో డిప్యుటేషన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి డాక్టర్ సుబ్రహ్మణం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–2026 సంవత్సరానికి సంబంధించి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉందన్నారు. స్క్రూట్నీ 30–31వ తేదీలలో జరుగుతుందన్నారు. రాత పరీక్ష నవంబర్ 5–8వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తామన్నారు.


