మద్యం మత్తులో రైలులో వీరంగం..
కడప కోటిరెడ్డిర్కిల్ : తిరుపతి నుంచి చర్లపల్లికి వెళుతున్న రైలులో మద్యం తాగి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించిన యువకుడికి శిక్షగా రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం (కమ్యూనిటీ సర్వీసు) చేయించారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఈనెల 18వ తేదీ కర్నూలు జిల్లా దొనకొండకు చెందిన వి.రవి అనే యువకుడు తిరుపతి–చర్లపల్లి రైలులో వెళుతూ మద్యం మత్తులో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది రైలు కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్‌ఫారానికి చేరుకున్న వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బీఎన్‌ఎస్ యాక్టు 355 ప్రకారం కేసు నమోదు చేశారు. రవి చేసిన తప్పునకు శిక్షగా కడప రైల్వేస్టేషన్‌ను మూడు గంటల పాటు అతనితో శుభ్రం చేయించాలని గురువారం అసిస్టెంట్ సెకండ్ క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు యువకుడి చేత రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయించారు.
రైల్వేస్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని
శిక్ష విధించిన న్యాయమూర్తి


