రాష్ట్రంలో మహిళలకు కరువైన రక్షణ
బద్వేలు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు, విద్యార్థినులకు, బాలికలకు రక్షణ కరువైందని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు.
గురువారం ఎన్‌జీఓ కాలనీలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడు లైంగిక దాడికి పాల్పడటం దారుణమన్నారు. అలాగే ఈ ఘటనతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంక్షేమ వసతి గృహంలో ఉంటూ పదవ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఈ రెండు ఘటనలతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతుందని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ఊరూరా బెల్టుషాపులు ఉండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మహిళలు, విద్యార్థినులు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ


