డబ్బులు చెల్లించాలంటూ మహిళల ఆందోళన
కడప అర్బన్ : స్థలం కొనిస్తామంటూ చెప్పి తమ కుమారుని వద్ద నుంచి రూ. 70 లక్షలకు పైగానే డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోగా, తన భర్తను బెదిరిస్తున్నారంటూ శ్వేత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు కారణమైన కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంకు నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె తమ బంధువులతో కలిసి గురువారం ఆందోళనకు దిగారు. సదరు పెట్రోల్ బంక్ నిర్వాహకుడి ఇంటి ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న చిన్నచౌక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు శ్వేత మాట్లాడుతూ పెట్రోలు బంకు నిర్వాహకుడు తమకు స్థలం ఇప్పిస్తానంటూ రూ. 70 లక్షలకు పైగానే తీసుకున్నాడన్నారు. స్థలం ఇవ్వాలని అడిగితే స్థలం లేదని దానికి బదులుగా పెట్రోల్ బంకు లీజుకు ఇస్తానని చెప్పాడన్నారు. ఆ తర్వాత తమకు డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నాడని తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. సంఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.


