వర్షపాతం వివరాలు
ఆశలు ఆవిరాయె
పంటంతా నీళ్లపాలైంది..
● జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
● వరుస వానలతో పట్టణ, గ్రామాల్లో
లోపిస్తున్న పారిశుధ్యం
● దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, పత్తి, మినుము పంటలు
మొలకొచ్చిన మొక్కజొన్న గింజలు
అధిక వర్షాలతో ఎర్రగుంట్ల మండలం చిన్నదన్నూరు, ఇట్లూరు గ్రామాల్లో నేలకొరిగిన వరిపంట
కడప అగ్రికల్చర్ : వరుస వానలు అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. చేతికందిన పంటలు నీళ్లపాలవుతుండడంతో కర్షకుడి కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఉపరితల ఆవర్తనం, తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జిల్లా ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అల్పపీడనం బలపడటంతో 24 గంటల నుంచి వాన జడి పట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఇక వరుస వానలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. దీంతో దోమల బెడద అధికమై జనాలు జ్వరాల బారిన పడుతున్నారు.
ఆరుతడి పంటలు సాగు చేసిన రైతుల్లో గుబులు
నిత్యం కురుస్తున్న వర్షాలకు భూమి తడారక ఆరుతడి పంటలు ఎర్రగా మారి దెబ్బతింటున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కలుపు మొక్కలను తొలగించుకోలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. పైగా కలుపును తొలగించాలంటే ఖర్చులు భారీగా వస్తాయని.. ప్రధాన పంటలకు తెగుళ్లు కూడా సోకుతున్నాయని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్నా, కుందూ నదీ పరివాహక ప్రాంతాలతోపాటు నీటి వసతి ఉన్న రైతులు బోర్ల కింద చాలా మంది ముందస్తుగా వరిపంట సాగు చేశారు. చిరుపొట్ట దశలో ఉన్న వరికంకి తాలుపోతోంది. అలాగే ఎన్ను దశలో ఉండే వరికి కంకిపైన ఉండే సుంకు రాలి ఎన్ను దెబ్బతింటోంది. దీంతో చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పటికే కోత కోసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రధాన రహదారుల వెంబడి, కళ్లాల్లో ఆరబెట్టుకుంటున్నారు. ఉన్నట్లుండి వచ్చిన వర్షంతో చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయింది.
మినుము, శనగ రైతులకు నష్టం..
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని మండలాల్లో మినుము, శనగ పంటలను విత్తుకున్నారు. విత్తుకున్న వెంటనే వరుస వానలు కురుస్తుండడంతో నేలంతా బాగా తడెక్కింది. దీంతో భూమిలో విత్తిన మినుము, శనగ విత్తనాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వరుస వానలకు పత్తికాయలోకి నీరు చేరి పత్తి(దూది) దెబ్బతింటోందని పత్తి సాగు చేసిన రైతుల్లో కలవరం మొదలైంది.
పాత ఇళ్లు, మట్టి మిద్దెలతో అప్రమత్తం
వారం నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పాత చవుడు మిద్దెలు కూలుతున్నాయి. ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన లక్ష్మిదేవికి సంబంధించిన మట్టిమిద్దె కూలింది. ఇలా చవుడు మిద్దెలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మట్టి , పాత దంత మిద్దెలు ఉన్న వారు వర్షాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం...
అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం పగలంతా వర్షం కురిసింది. ఒంటిమిట్టలో అత్యదికంగా 66.4 మి.మీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన కడపలో రహదారులు నీటితో నిండిపోయాయి.
మొక్కజొన్న గింజలపై పట్టలు కప్పిన రైతులు
ఎర్రగుంట్ల పట్టణంలోని ప్రకాష్‌నగర్‌కాలనీలో కూలిన మట్టిమిద్దె
నేను నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. దిగుబడి బాగా వచ్చింది. కల్లంలో మొక్కజొన్న గింజలను ఆరబెట్టుకుని ఉండగా ఉన్నట్లుండి వచ్చిన ఎడతెరిపి లేని వర్షాలతో గింజలు తడిచిపోయాయి. అక్కడక్కడ గింజలు మొలకలు వస్తున్నాయి. ఇక వ్యాపారులు ధర తగ్గించి అడుగుతారు. ఎకరాలకు రూ. 40 వేలదాకా వస్తుందని ఆశపడ్డాము. మరి ఎంత వస్తుందో చూడాల. – పంజగల ఓం ప్రసాద్.
దూలంవారిపల్లె , కలసపాడు మండలం
నేను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేశాను. దిగుబడి పర్లేదు. మొక్కజొన్న గింజలను ఆరబెట్టుకుంటే వర్షానికి తడిచి పోయాయి. దీనికితోడు ఎర తెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో పట్టలు కూడా తీసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో పట్టకింద ఉక్కకు గింజలు మొలకలు వచ్చాయి. ఏం చేయాలో ఆర్థం కావడం లేదు. దాదాపు లక్షన్నర వస్తుందని ఆశపడ్డాను. ఇప్పుడు పరిస్థితేందో అర్థం కావడం లేదు. గ్రామానికి చెందిన చాలామంది రైతులకు సంబంధించిన దాదాపు 600 క్వింటాళ్ల విత్తనాలు తడిచాయి.
– నామాల వెంకటరమణ, దూలంవారిపల్లె. కలసపాడు మండలం.
వర్షపాతం వివరాలు
వర్షపాతం వివరాలు
వర్షపాతం వివరాలు


