పడకేసిన పల్లె వైద్యం
● మూడు వారాలకు పైగా సమ్మెలో గ్రామీణ పీహెచ్‌సీ వైద్యులు
● ఇన్‌ఛార్జి వైద్యులతో
అంతంతమాత్రంగా వైద్య సేవలు
గ్రామీణ వైద్యం అటకెక్కింది. వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టడంతో పల్లెవాసులకు వైద్య సేవ అందని దుస్థితి నెలకొంది. వైద్యులు సమ్మెలోకి వెళ్లినా..వైద్యం పడకేసినా పాలకులకు పట్టకపోవడంపై గ్రామీణుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
కడప రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా లభించే ప్రాథమిక వైద్యం పూర్తిగా గాడి తప్పింది. వైద్యులు తమ సమస్యల పరిష్కారానికి సెప్టెంబరు 28 నుంచి విధులను బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. దీంతో కొద్దిరోజులపాటు పూర్తిగా వైద్య సేవలకు ఆటంకం కలిగింది. ఆ సమయంలో స్థానికంగా ఉన్న నర్సులే వైద్యుల పాత్ర పోషించారు. అనంతరం జిల్లా యంత్రాంగం కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని వైద్యులను ఇన్‌చార్జిలుగా పీహెచ్‌సీలకు పంపించారు. పీహెచ్‌సీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. అయితే ఇన్‌ఛార్జి వైద్యులు చాలా ప్రాంతాల్లో ఆస్పత్రికి వచ్చిన వైద్యులను చూసి గంట, రెండు గంటల తర్వాత వెళుతున్నట్లుగా తెలిసింది. దీంతో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడినట్లయింది. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కాలం నడుస్తోంది. వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. దీంతో పల్లెవాసులు పీహెచ్‌సీలకు వెళ్లినా అక్కడ సక్రమంగా వైద్య సేవలు లభించకపోవడంతో చేసేదీలేక సమీపంలోని పట్టణాలకు వెళుతున్నారు.


