
కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్య రంగం కుదేలు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్య రంగం కుదేలయిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. మంగళవారం 34వ డివిజన్‌లో ఏకే ఫంక్షన్ హాలులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ‘కోటి సంతకాల సేకరణ’ చేపట్టారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వైద్య రంగాన్ని సువర్ణ అధ్యాయంగా మారిస్తే.. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆ కార్యక్రమాలను నీరుగారుస్తూ ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా చేస్తున్నారన్నారు. ప్రతి జిల్లాకు ఒక బోధనాసుపత్రి ఉండాలన్న సంకల్పంతో తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ, తన బినామీలకు, తన మనుషులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజావైద్యం ప్రజల హక్కు అని, ప్రజల ఆస్తులు ఎప్పటికీ ప్రజలకే చెందాలన్నారు. చాలా కుటుంబాలు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని నాణ్యమైన విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయన్నారు. ఫలితంగా మధ్యతరగతి వాళ్లు పేదవాళ్లుగానూ, పేదవాళ్లు మరింత పేదవాళ్లుగానో మారిపోయారన్నారు. ఇలా జరక్కూడదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.8,480 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నెట్‌వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా పరిశీలకుడు, మాజీ మేయర్ కె. సురేష్ బాబు మాట్లాడుతూ 1923 నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, 14 ఏళ్ల తన పాలనలో చంద్రబాబు కనీసం ఒక్క గవర్నమెంటు మెడికల్ కాలేజీ కూడా కట్టలేదన్నారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలను పీపీపీ విధానంలో తన మనుషులకు అప్పగించేందుకు సిద్ధమవడం దుర్మార్గమన్నారు. ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ దీన్ని అడ్డుకుంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి మేయర్ ముంతాజ్ బేగం, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జోనల్ అధ్యక్షులు బీహెచ్ ఇలియాస్, రామ్మోహన్‌రెడ్డి, 34వ డివిజన్ ఇన్‌చార్జి అక్బర్ అలీ, గౌస్ చాక్లెట్, షఫీ, దేవిరెడ్డి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా,
మాజీ మేయర్ కె.సురేష్ బాబు