వైవీయూను మేటి యూనివర్సిటీగా నిలపడమే లక్ష్యం
కడప ఎడ్యుకేషన్ : ‘యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని సరికొత్త ప్రణాళికలతో దేశంలో మేటి యూనివర్సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తా.. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో నంబర్ వన్ విశ్వ విద్యాలయంగా నిలబెట్టడం కోసం అందరి సహకారంతో సమిష్టిగా కృషి చేస్తా’ అని యోగివేమన విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య బొల్లంకొండ రాజశేఖర్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలోని తన చాంబర్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాణ్యమైన బోధన, పరిశోధన, ఉద్యోగ నైపుణ్యాల ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నానన్నారు. ఈ మూడేళ్లలో వైవీయూను వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అందరితో కలిసి వ్యూహాలు రచిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయంలో 98 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారని, అంతర్జాతీయ స్థాయిలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లు కలిగి ఉండటం, 1700 పరిశోధన పత్రాలు స్కోప్, వెబ్సోర్ట్ వంటి ప్రామాణిక జర్నల్స్‌లో పబ్లిష్ అవడం విశ్వవిద్యాలయ ప్రగతికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో వీరు నిర్వహించే క్రియాశీలక పాత్రతో విశ్వవిద్యాలయం నంబర్ వన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2027వ సంవత్సరంలో నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్(ఎన్.ఎ.ఎ.సి) ఎ ప్లస్ గ్రేడ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్( ఎన్. ఐ.ఆర్.ఎఫ్) జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే ర్యాంకింగ్‌లో వైవీయూ మొదటి వందలోను, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో ఒకటి నుంచి 20 లోపు ర్యాంకుల్లో నిలిచేలా గట్టి ప్రయత్నం చేస్తామన్నారు. త్వరలో దూరవిద్యలో ఆన్‌లైన్ విద్యా విధానాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. పద్మ, ఐక్యు ఏసీ డైరెక్టర్ డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడారు. ఈ సమావేశంలో వైవీయూ పబ్లిక్ రిలేషన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ సరిత, అడిషనల్ పబ్లిక్ రిలేషన్ సెల్ ఆఫీసర్ డాక్టర్ కె. శ్రీనివాసరావు, డాక్టర్ తుమ్మలూరు సురేష్ బాబు పాల్గొన్నారు.
వైవీయూ వైస్ చాన్సలర్
ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్


