నీటి కుంటలోకి దిగి మూడు ఎద్దులు మృతి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని సిర్రాజుపల్లి గ్రామానికి చెందిన ఒంటిగారి గంగరాజుకు చెందిన మూడు ఎద్దులు నీటి కుంటలోకి దిగి బురదలో ఇరుక్కుని మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గంగరాజు ఉదయాన్నే పొలం పనులు ముగించుకొని ఎద్దుల బండికి వెనుక భాగంలో మరో ఎద్దును కట్టుకొని ఇంటికి బయలు దేరాడు. దండుపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో పాలకుంట వద్ద ఎద్దులను శుభ్రం చేసేందుకు గంగరాజు నీటి కుంటలోకి ఎద్దుల బండిని తీసుకెళ్లాడు. అయితే కుంట చాలా లోతు ఉండట వల్ల ఎద్దుల బండి నీటిలోకి మునిగింది. దీంతో గంగరాజు ఎద్దులను కాపాడేందుకు ప్రయత్నించాడు. బండితో సహా ఎద్దులు నీటిలో మునిగి పోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్రాక్టర్ సాయంతో నీట మునిగి ఉన్న మూడు ఎద్దులను బయటకు తీశారు. అప్పటికి మూడు ఎద్దులు మృతి చెంది ఉన్నాయి. ఎద్దుల యజమాని లబోదిబోమంటూ విలపించాడు.


