వైభవంగా శివపార్వతుల కల్యాణం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం మాస శివరాత్రి సందర్భంగా అగస్త్యేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి మూలవిరాట్‌లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరిదేవికి కుంకుమార్చనలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. గోపూజ, గణపతి, నవగ్రహ, రుద్రహోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సాయంత్రం గంగారాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి, కాలక్షేప మండపంలోని కల్యాణ వేదికపై ఆశీనులను చేశారు. సుమూహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవోపేతంగా కల్యాణోత్సవాన్ని జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.


