
జర్నలిస్టులకు ప్రెస్‌క్లబ్ ఆర్థికసాయం
కడప రూరల్ : ఇటీవల మరణించిన, ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడిన జర్నలిస్టుల కుటుంబాలకు కడప వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్ తరపున మంగళవారం ఆర్థికసాయం అందించారు. అనారోగ్యంతో మృతి చెందిన ఇమామ్ అనే జర్నలిస్టు కుటుంబానికి ప్రెస్‌క్లబ్ తరపున ఏపీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటరెడ్డి, ప్రెస్‌క్లబ్ కన్వీనర్ లక్ష్మినాథరెడ్డి రూ. 20 వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. అలాగే ప్రమాదాలు, అనారోగ్యానికి గురైన సుధీర్, సుధీర్, శ్రీనివాసులు, చాంద్‌బాషాలకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున అందజేశారు. ఇలా మొత్తం రూ. 60 వేలు సాయం అందించారు. అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టులకు అండగా నిలిచేందుకు కడప ప్రెస్‌క్లబ్ గత మూడేళ్లుగా పది వేల రూపాయలు తక్షణ సాయం కింద అందజేస్తోందని, మరణించిన వారి కుటుంబాలకు రూ. 20 వేలు ఇస్తున్నామని కన్వీనర్ లక్ష్మినాథరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రమేష్, మురళి, కిశోర్, కెమెరామెన్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.