
సైబర్ వల.. జనం విలవిల..!
కడప అర్బన్ : ప్రస్తుత ఆధునిక సాంకేతిక సమాజంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ) ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. ఆన్‌లైన్‌లో ఆర్థిక నేరాలు చేసే వాళ్లు సైతం ఏఐని ఉపయోగించి సరికొత్త మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. మోసం చేసిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆడ మగ కూడా గుర్తించడం వీలు కాదు. కానీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న లక్షలకు లక్షల రూపాయలను కొట్టేస్తున్నారు. నిందితులను గుర్తించడం, పట్టుకోవడం, పోగొట్టుకున్న నగదును రికవరీ చేయడం పోలీసులకు సవాలుగా మారింది.
ఆర్థికంగా చితికి పోతూ..
అవమానంగా భావిస్తూ....
తమ ఖాతాల్లో డబ్బులు పోగొట్టుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని కొందరు మానసిక వేదనతో కుంగి పోతున్నారు. కానీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం వలన పోగొట్టుకున్న నగదు మళ్లీ బ్యాంకు ఖాతాకు తెప్పించడం పోలీసులకే సాధ్యం. సైబర్ మోసగాళ్లు విసురుతున్న సరికొత్త సవాళ్లను ఛేదిస్తూ.. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ జిల్లా పోలీసు యంత్రాంగం అండగా నిలుస్తోంది. గత మూడేళ్లలో సైబర్ క్రైమ్ ద్వారా పోగొట్టుకున్న కోట్లాది రూపాయల నగదును బ్యాంకుల్లోనే ఫ్రీజ్ చేయగలగడం జిల్లా పోలీసు యంత్రాంగానికి సాధ్యం.
అడ్డు అదుపు లేని దురాశతో...
వైఎస్సార్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు ఇటీవల వస్తున్న సైబర్ మోసాల సంఘటనలు చూస్తుంటే పోలీసులే షాక్‌కు గురవుతున్నారు. అడ్డు అదుపు లేని దురాశ, అనవసరమైన వాటిని క్లిక్ చేయడం, మోసాలకు ప్రధాన కారణంగా మారుతోందని గ్రహిస్తున్నారు. వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్‌లో చాలావరకు ఏపీకే ఫైల్స్ వస్తుంటాయి. వీటిని ఏమాత్రం క్లిక్ చేసినా ఖాతాలో డబ్బులు ఖాళీ అవుతున్నాయి. కొందరు లక్కీ డిప్ బహుమతి వచ్చిందని బాధితులను ఆకర్షితులను చేసి వారిని వేధించి డబ్బులను దోచేస్తున్నారు. అనవసరమైన వాటి జోలికి వెళ్లడం సంబంధంలేని ఫైల్స్ పై క్లిక్ చేయడమే సైబర్ నేరం జరగడానికి బీజంగా మారుతుంది.
ఏపీకే ఫైల్స్ ఎవరి సెల్ ఫోన్‌కు వచ్చినా వాటిని తమ మొబైల్ డేటా ఆఫ్ చేసి కనుక్కోవచ్చు. తమ వాట్సాప్‌కు గాని టెక్ట్స్ మెసేజ్ గాని ఏపీకే ఫైల్స్ ఎవరి ద్వారానైనా వస్తే వాటిని క్లిక్ చేయకూడదు. తమ మొబైల్ డేటాను, వైఫైని మొదట ఆఫ్ చేయాలి. తరువాత వాట్సాప్ ఓపెన్ చేసి పైభాగానికి వెళ్లి ఏపీకే అని టైప్ చేయాలి. ఏ ఏ గ్రూపులో, వ్యక్తిగత కాంటాక్ట్‌ల ద్వారా వచ్చిన ఏపీకే ఫైల్స్ కనబడతాయి. అప్పుడు ఏపీకే ఫైల్స్ మీద క్లిక్ చేయకుండా, కాంటాక్ట్ పై క్లిక్ చేయాలి. తర్వాత సదరు గ్రూపులో గాని, కాంటాక్ట్‌లోకి గాని వెళ్లి వాటిని డిలీట్ చేయాలి. ఏపీకే ఫైల్స్ పూర్తిగా డిలీట్ చేసిన తర్వాత మొబైల్ డేటాని గానీ వైఫైనిగానీ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడు ఏపీకే ఫైల్స్ వచ్చినా వాటిని ఇలాగే డిలీట్ చేస్తే మీ మొబైల్ డేటా సురక్షితంగా ఉంటుంది. పొరపాటున మొబైల్ డేటా ఆన్ లో ఉంచుకొని ఏపీకే ఫైల్స్ టచ్ చేస్తే, వెంటనే బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఇట్టే సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోతాయి. తస్మాత్ జాగ్రత్త.
ఆన్‌లైన్ లింకులు క్లిక్ చేయరాదు..
బ్యాంకుల నుంచి వ్యక్తిగత వివరాలు ఎప్పుడూ అడగరు. అలా అడిగితే అది సైబర్ నేరగాళ్లపనే. ఆన్‌లైన్ లింకులు వస్తే వాటిని క్లిక్ చేయొద్దు. ఒకవేళ క్లిక్ చేస్తే వెంటనే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ చేయవద్దు. ఒకవేళ చేశారంటే మీ బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరినట్టే. ఫేస్‌బుక్‌లో కూడా అందమైన అమ్మాయిల పేరిట హనీ ట్రాప్, లింకులు పెట్టి మోసం చేస్తారు. అలా జరిగితే వెంటనే సైబర్ పోలీసులకు తెలియజేయాలి.
● సురక్షితమైన డిజిటల్ లావాదేవీలు...
● బ్యాంకు లావాదేవీలకు సంబంధించి లాగిన్ ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీ, ఏటీఎం, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది.
● డిజిటల్ లావాదేవీలకు బార్ కోడ్ లు, క్యూ ఆర్ కోడ్‌లు, స్కానింగ్ లేదా ఎం పిన్ లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి.
● ఏదైనా ఫోన్ కాల్, ఈ– మెయిల్ చేసి, మీ కేవైసీ అప్డేట్ చేయాలని వివరాలు అడిగినా చెప్పరాదు. ఒకవేళ అలాంటి అనుమానాలు ఉంటే బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవాలి. హోమ్ బ్యాంక్ శాఖను సంప్రదించాలి.
● ఈ– మెయిళ్ళు, ఎస్‌ఎంఎస్ లలో యుఆర్‌ఎల్, డొమైన్ పేర్లను స్పెల్లింగ్ లోపాలుంటే జాగ్రత్తగా తనిఖీ చేయాలి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లనే ఉపయోగించాలి.
● ఏదైనా వెబ్‌సైట్, అప్లికేషన్లలో మీ ఈ–మెయిల్ ను యూజర్ ఐడీగా నమోదు చేస్తున్నప్పుడు మీ ఈ– మెయిల్ పాస్‌వర్డ్ ను పాస్‌వర్డ్ అని పెట్టుకోవద్దు.
సైబర్ నేరాలకు సంబంధించి కొంతమంది బాధితుల ఉదాహరణలు ఇలా..
● డిజిటల్ అరెస్ట్ పేరుతో పులివెందులకు చెందిన రిటైర్ట్ టీచర్ రూ.1.50 కోట్లు, ప్రొద్దుటూరుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ. 3.50 కోట్లు, కడపకు చెందిన రిటైర్డ్ డాక్టర్ నుంచి రూ. 65 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. మొదట వీడియోకాల్స్, వాట్సాప్ కాల్స్ ద్వారా సీబీఐ, ఈడీ, పోలీసుల పేర్లతో బెదిరించి వివరాలను సేకరించి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులను కాజేస్తారు.
● పెట్టుబడుల పేరుతో డబ్బులను రూ.10వేలు పెట్టించి వెంటనే రూ.15వేలు జమచేస్తారు. ట్రేడింగ్ పేరుతో కడపకు చెందిన వ్యక్తి రూ.1.50 కోట్లు, ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి రూ.1.50 కోట్లు, పులివెందులకు చెందిన రిటైర్డ్ టీచర్ రూ. 65 లక్షలు పోగొట్టుకున్నారు.
● హనీట్రాప్ పేరుతో ఒంటరిగా జీవిస్తున్న వారు, ప్రత్యేకంగా యువకులు మోసపోతున్నారు. బద్వేల్‌కు చెందిన వ్యక్తి రూ. 6.50 లక్షలు, జమ్మలమడుగుకు చెందిన వ్యక్తి రూ. 70 లక్షలు, ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి రూ.2.50 లక్షలు పోగొట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 మంది బాధితులు హనీట్రాప్‌కు గురైనవారు వుంటారు.
● వర్క్‌ఫ్రం హోమ్, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి నుంచి ప్రాసెస్ ఫీజుల పేరుతో రూ.2500, రూ.3500 వసూలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇలాంటి బాధితులున్నారు.
సోషల్ మీడియా పేరుతో అసత్యప్రచారం చేసేవారిపై ఫిర్యాదులను 9121100686 కుగానీ, సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్న వారు 1930కు గానీ, సైబర్ నేరానికి గురైన తరువాత గంటలోపు ఫిర్యాదు చేస్తే మంచిది. కడపలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షణలో పోలీసు అధికారుల సూచనల మేరకు ఇన్స్‌పెక్టర్ మధుమల్లేశ్వర్‌రెడ్డి, సిబ్బంది కృషి చేస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వైనం
ఏమరుపాటుగా ఉంటే
ఖాతాలో డబ్బులు ఖాళీ
అప్రమత్తతే ఆయుధం అంటున్న పోలీసులు