
కూటమి పాలనలో రైతులకు తీరని అన్యాయం
మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
ఖాజీపేట : కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా తీరని నష్టం జరిగిందని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. తుడుమలదిన్నె సమీపంలో వంక దాటే క్రమంలో కింద పడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మద్దూరి ఆదిరెడ్డిని మంగళవారం ఆయన పరామర్శించారు. రైతు రెండు ఎద్దుల వంకలో పడి మృతి చెందిన విషయం తెలుసుకుని వైఎస్సార్‌సీపీ తరఫున రూ.72 వేల ఆర్థికసాయం అందజేశారు. ఆయన మాట్లాడుతూ యూరియా కోసం సచివాలయాల వద్ద రైతులు క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఎప్పుడూ రైతులకు సమస్య లేదన్నారు. పంట నష్ట పరిహారం ఎప్పటికప్పుడు రైతులకు అందించేదని, ఇన్సూరెన్స్ పూర్తి ఉచితంగా ఇవ్వడమేగాక, గిట్టుబాటు ధర కల్పించి తమ ప్రభుత్వంలో రైతులను ఆదుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని, రైతుల పంటలకు సరైన ధర లేక తీవ్ర నష్టాలను చవిచూశారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. పేదలకు న్యాయం జరగదని పేదలకు వై ద్యం అందే పరిస్థితి లేదన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే వైద్యం మరింత ఖరీదవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పీవీ.రాఘవరెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, నాగిరెడ్డి, సుబ్బారెడ్డి, పత్తూరు వెంకటయ్య, రమణ, వెంకటసుబ్బయ్య, దుంపలగట్టు రామకృష్ణారెడ్డి, పోలు ఓబుల్‌రెడ్డి, శెట్టిపల్లె సిద్దారెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు
కమలాపురం : విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వంద శాతం అమలుచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. కమలాపురం సబ్ జైలులో ఉన్న దువ్వూరు మండలం ఇడమడకకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత శ్రీకాంత్‌ను రఘురామిరెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ బడిలో పంతులు విద్యార్థులకు అక్షరాలు నేర్పించినట్లు రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నేర్పిస్తున్నారని మండిపడ్డారు. మైదుకూరు ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, డాబా పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీకాంత్‌ను మర్డర్ కేసులో ఇరికించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కానుగూడూరుకు చెందిన ఓ వ్యక్తి, శ్రీకాంత్‌తో చాగలమర్రి పీఎస్ పరిధిలో వాగ్వివాదం చేసాడని, దీంతో దువ్వూరు పీఎస్‌లో శ్రీకాంత్‌పై 307 సెక్షన్‌తో కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి ఘటనలు, చిన్న ఘర్షణ కూడా జరగకపోయినా కేసులు నమోదు చేయడం అన్యాయం అన్నారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరి కాదన్నారు. మీరు రెడ్ బుక్ రాసుకుంటే మేము బ్లూ బుక్‌లో రాసుకుంటున్నామని, వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనన్నారు. కూటమి నేతలు ప్రజల విశ్వాసం కోల్పోయారని, చంద్రబాబు, లోకేష్ తెలుసుకోక పోతే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సంబటూరు ప్రసాద్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు.