
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి
ప్రొద్దుటూరు : గత ఏడాది ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 14లక్షల మంది ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీ కూటమి ప్రభుత్వం అమలుచేయలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఓ వైపు సీఎం చంద్రబాబునాయుడు, మరో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ లెక్కలేనన్ని హామీలిచ్చి ఉద్యోగులను మోసం చేశారన్నారు. గడిచిన 16 నెలల్లో 16 పైసలు కూడా ఇవ్వలేదని, వారికి మొత్తం రూ.32వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. డీఏ, అరియర్స్, జీఎల్‌ఐ, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ సమస్యలను నేటికీ పరిష్కరించలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు, కంటింజెంట్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చారన్నారు. ఆరు నెలలకోమారు డీఏ చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకూ నాలుగు డీఏ బకాయిలు ఇవ్వలేదన్నారు. వచ్చే జనవరి నాటికి ఐదో డీఏ ఇవ్వాల్సి ఉందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని అడిగినందుకు 38 మంది ఉద్యోగులను కూటమి నేతలు జైలులో పెట్టించారని తెలిపారు. పీఆర్సీ, ఐఆర్ చెల్లించలేదని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయలేదన్నారు. ఉద్యోగుల పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, డిమాండ్ చేశారు. వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌ల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వహించకుండా వారి స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చించడానికి ప్రయత్నిస్తే కనీసం వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానం అమలు చేయడం సబబుగా లేదన్నారు. ఈ సమావేశంలో మార్తల ఓబుళరెడ్డి, బాణాకొండారెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, రాగుల శాంతి, లావణ్య, బలిమిడి వెంకటలక్ష్మి, భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, సత్యం, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎద్దుల రాయపురెడ్డి, జయంగమయ్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి