
మెప్మా ఆర్‌పీ చేతివాటం
● నకిలీ సంతకాలతో
సీసీఎల్ రుణాలు స్వాహా
● పోలీసులను ఆశ్రయించిన మహిళలు
బద్వేలు అర్బన్ : మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో ఓ ఆర్‌పీ చేతివాటం ప్రదర్శించింది. తన పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు సీసీఎల్ రుణాలు మంజూరు చేయించి అందులో వారికి తెలియకుండా కొంత మొత్తాన్ని స్వాహా చేసింది. మొత్తంగా 8 గ్రూపులకు సంబంధించి దాదాపు రూ.12 లక్షల మేర స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా తెలుసుకున్న సంబంధిత స్వయం సహాయక సంఘాల గ్రూపు మహిళలు పోలీసులను ఆశ్రయించారు.
సీసీఎల్ రుణాలు స్వాహా
మున్సిపాలిటీ పరిధిలోని శివానగర్ ఏరియాకు సంబంధించి మెప్మా ఆర్‌పీగా పనిచేస్తున్న భారతి తన పరిధిలోని పలు సంఘాలకు వివిధ బ్యాంకుల నుంచి సీసీఎల్ రుణాలు మంజూరు చేయించింది. సదరు రుణాలను మూడేళ్ల పాటు చెల్లించాల్సి ఉండగా ఏడాదిన్నర పాటు సంఘంలోని సభ్యులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అయితే చెల్లించిన అప్పు మొత్తం నుంచి తిరిగి రుణం పొందే అవకాశం ఉండటంతో ఆర్‌పీ తన చేతివాటాన్ని ప్రదర్శించింది. గ్రూపు సభ్యులకు తెలియకుండా సంతకాలను ఫోర్జరీ చేసి పలు సంఘాలకు మళ్లీ రుణం మంజూరు చేయించింది. అయితే సదరు రుణం గ్రూపు సభ్యులకు అందించకుండా స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బ్యాంకులకు రుణాలకు సంబంధించిన నగదును చెల్లించేందుకు వెళ్లిన ఆయా గ్రూపుల సభ్యులకు విషయం తెలియడంతో ఆర్‌పీని నిలదీశారు. అప్పట్లో కొన్ని గ్రూపులకు డబ్బులు చెల్లించి విషయం బయటికి పొక్కకుండా సద్దుమణిగింపజేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల గౌరీశంకర్‌నగర్‌కు చెందిన శంకర్ స్వయం సహాయక సంఘం, సరస్వతి స్వయం సహాయక సంఘంలకు చెందిన మహిళలు తమ పేరుతో తీసుకున్న రుణాన్ని చెల్లించాలని ఆర్‌పీని నిలదీయడంతో కొంత సమయం ఇవ్వాలని కోరింది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని ఇంటి వద్ద లేకుండా వెళ్లిపోయినట్లు మహిళలు గుర్తించారు. దీంతో చేసేది లేక అర్బన్ పోలీసులను ఆశ్రయించారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం
రుణాల పేరుతో ఆర్‌పీ డబ్బు స్వాహా చేసిన విషయమై ఇన్‌చార్జి మెప్మా మేనేజర్ కల్యాణ్‌బాబును వివరణ కోరగా ... రెండు నెలల క్రితమే బద్వేలు మెప్మా ఇన్‌చార్జి మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నా శివానగర్ ఏరియాలోని పలు గ్రూపులకు చెందిన ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు రుణాల మంజూరులో ఆర్‌పీ చేసిన అవకతవకలపై ఫిర్యాదు చేశారు. మెప్మా పీడీకి ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.