కడప రూరల్ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఎం.రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.అచ్చయ్య తెలిపారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురుకులాల్లో పనిచేసిన సుమారు 550 మందికి, జిల్లాకు సంబంధించి 50 మందికి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉందన్నారు. 2018లో రిటైర్డ్‌మెంట్ అయిన వారి విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వానికి తగదన్నారు. 50మంది బెనిఫిట్స్ అందుకోకుండానే వివిధ కారణాలతో మృతిచెందడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఉద్యోగ జీవితంలో 30–35 సంవత్సరాలపాటు పనిచేస్తేనే ప్రభుత్వం ఉద్యోగ విరమణ సమయంలో బెనిఫిట్స్ అందిస్తోందన్నారు. విజయవాడలోని తమ శాఖ ఉన్నతాధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిదులకు వినతిపత్రాలను సమర్పించామన్నారు. అంతేగాక మెడికల్ రీఎంబర్స్‌మెంట్ నిధులు అందకపోవడంతో బాధిత ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు. ఉచిత పథకాలకు డబ్బులిస్తున్న ప్రభుత్వం ఉద్యోగ జీవితంలో కష్టపడి పనిచేసిన వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఏపీ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.