
వాటా కోసం వేట
అదానీ, అల్ట్రాటెక్, సెయిల్‌కు వరుసగా వేధింపులు
సాక్షి ప్రతినిధి, కడప: ‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా’ అన్నట్లుగా సంస్థలకు, కాంట్రాక్టర్లకు అధికార పరపతి ఎలా ఉంటుందో జమ్మలమడుగు కూటమి నేతలు రుచి చూపిస్తున్నారు. సంస్థ ఏదైనా సరే వారి కనుసన్నుల్లో నడుచుకుంటే సరే.. లేదంటే అల్లాడిపోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమ నుంచి అదానీ ఐడల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనుల వరకూ నిర్వాహకులు ముప్పుతిప్పలకు గురయ్యారు. తాజాగా టీ.కోడూరు వద్ద నిర్మాణంలో ఉన్న సోలార్ కంపెనీ ఆ జాబితాలో చేరింది. రాత్రికి రాత్రి కోట్లాది విలువైన ఫ్యానెల్స్, ఐరన్, కేబుల్స్, బ్యాటరీలు మాయం అవుతున్నాయి. కుయ్యో మొర్రో అంటూ సంస్థ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకుంటున్న వైనమిది.
రూ.1700 కోట్ల అంచనా వ్యయంతో..
కొండాపురం మండలం టీ.కోడూరు గ్రామ పొలాల్లో సెయిల్ (ఎస్‌ఏఈఎల్) కంపెనీ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. రూ.1700 కోట్ల అంచనా వ్యయంతో 380 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టేందుకు సిద్ధమైంది. ఆమేరకు 2024లో రైతుల నుంచి 1500 ఎకరాల భూమి 30 ఏళ్లు లీజుకు తీసుకుంది. ప్రభుత్వ అనుమతులు దక్కడంతో 2025 ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభించింది. సెయిల్ కంపెనీ సోలార్ నిర్మాణ పనులు ఓ వైపు కొనసాగిస్తుండగా.. మరోవైపు కూటమి నేతలు చుక్కలు చూపిస్తున్నారు. కొండాపురం మండల బాధ్యుల సహకారంతో టీ.కోడూరు నేతలు ముప్పుతిప్పలు పెడుతున్నట్లు సమాచారం. నిర్మాణ పనులు అప్పగించిన సంస్థకు అనేక సమస్యలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు
సెయిల్ కంపెనీ నిర్మిస్తున్న సోలార్ నిర్మాణ పనుల్లో రాత్రికి రాత్రి సోలార్ ప్యానెల్స్, ఐరన్, కేబుల్స్, బ్యాటరీలు మాయం అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన పరికరాలు వరసగా చోరీకి గురవుతున్నాయి. ఇప్పటికీ పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదే విషయమై కంపెనీ ప్రతినిధులు తాళ్లప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెయిల్ కంపెనీ ప్రతినిధి ఆనంద్ దూభే ఫిర్యాదు మేరకు ఈ నెల 6న క్రైమ్ నంబర్ 154/25 ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సెక్యూరిటీ ఇన్‌చార్జి మహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 8న క్రైమ్ నంబర్ 158/25 ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు కూటమి నేతల ప్రమేయాన్ని గుర్తించారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన మండల బాధ్యుడు ఒకరు పోలీసులతో మధ్యస్తం నెరిపారు. ‘మీ వాటా మీకు అప్పగిస్తాం, ఎలాంటి చర్యలు చేపట్టవద్దు’ అని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆపై అధికార పార్టీ నేతల మాట జవదాటని పోలీసుశాఖ.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. డబుల్ స్టార్ అధికారి పెద్ద మొత్తంలో దోపిడీదారుల నుంచి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణ సంస్థకు మాత్రం ఇప్పటికీ కూటమి నేతల వేధింపులు తప్పడం లేదు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో అదానీ హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అధికార పార్టీ నేతలు ప్రత్యక్ష దౌర్జన్యం చేశారు. ఏకంగా సైట్ ఇంజినీర్‌పై దాడి చేశారు. సివిల్ పనులు చేస్తున్న రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు ముప్పుతిప్పలు పెట్టారు. ఆపై అల్ట్రాటెక్ పరిశ్రమపై దృష్టి పెట్టారు. అల్ట్రాటెక్‌లో పూర్తి ఆధిపత్యం కోసం చేయని దందాలు లేవు. అక్కడే టెంటు వేసుకొని సిమెంటు ఉత్పత్తికి ఆటంకం కల్గించారు. ఆమేరకు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని దౌర్జన్యం రుచి చూపించారు. ఆర్టీపీపీలో సైతం అలాంటి వ్యవహారమే తెరపైకి వచ్చింది. తాజాగా సెయిల్ సోలార్ ప్లాంట్‌లో నిర్మాణ పరికరాలు చోరీకి గురవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన పరికరాలు కోల్పోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇలాంటి దుస్సాహాసం వెనుక కూటమి నేతల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉన్నట్లు పరిశీలకులు ఆరోపిస్తుండటం గమనార్హం.
సెయిల్ కంపెనీకి చుక్కలు చూపిస్తున్న కూటమి నేతలు
ప్యానెల్స్, ఐరన్, కేబుల్స్, బ్యాటరీలు రాత్రికి రాత్రే మాయం
కోట్లు విలువైన పరికరాల చోరీ వెనుక నాయకుల ప్రమేయం
కేసు నమోదు చేసి చేతులుదులుపుకొన్న పోలీసుశాఖ